మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఇటీవల నెలకొన్న వివాదం సమయంలో మంత్రి కూతురు చేసిన వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఆదివారం ఢిల్లీలో మహేష్ కుమార్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదాల గురించి ప్రశ్నించగా.. అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. మంత్రి కొండా సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సమాచార లోపం కారణంగా తలెత్తిన వివాదం సమిసిపోయిందన్నారు. అక్కడక్కడా తలెత్తిన వివాదాలూ పరిష్కారమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని మహేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
కులాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్టీ అన్నింటికీ సుప్రీం అని గుర్తు చేసారు. అక్కడ హైదరాబాద్‌లో ఏమి జరుగుతుందో ఢిల్లీలో అధిష్టానానికి తెలియదనుకోవడం అమాయకత్వం అవుతుందన్నారు. తామంతా అధిష్టానం రాడార్ పరిధిలోనే ఉన్నామన్న విషయాన్ని అందరూ గుర్తించుకుంటే బాగుంటుందని అన్నారు. ఎంతటి వారైనా పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. అధికారులు, మంత్రులెవరైనా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన తెలిపారు.