మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర భవిష్యత్ ను నిర్దేశించే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చారిత్రక తీర్పు ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్ లో ఎన్నికల ప్రచారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ లో విధ్వంసం జరిగిందని,అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలైన బిఆర్‌ఎస్ కుయుక్తులు ఈ ఉప ఎన్నికలో తిప్పి కొట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికతో బిఆర్‌ఎస్ కథ పరిసమాప్తమవుతుందని మంత్రి తెలిపారు.
మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి సిఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ ఓటర్లు సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు. నియోజకవర్గంలో స్థానికుడిగా, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపించడంతో జుబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సమస్యలు మాధుర నగర్ కాలనీలోని మౌలిక వసతుల లోపాలను, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎంఎల్‌ఏ నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.