డివిజన్ కమిటీ నేత ముఖేష్ సహా మారణాయుధాల అప్పగింత
బస్తర్‌లో సాగుతోన్న లొంగుబాట
కంకేర్ : ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో మావోయిస్టుల లొంగుబాట కొనసాగింది. ఆదివారం కంకేర్ జిల్లాలో 21 మంది నక్సల్స్ తమ ఆయుధాలతో అధికారుల ఎదుట లొంగిపోయారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసు విభాగం చేపట్టిన భారీ స్థాయి పునరావాస , జనజీవన ప్రవేశ విధానం పూనా మార్గెమ్ పరిధిలో ఈ నక్సల్ సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు. అస్త్ర సన్యాసం చేసిన వీరిలో 13 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. తొమ్మండుగురు ఏరియా కమిటీ సభ్యులు. మిగిలిన వారు నిషేధిత ఉద్యమ కేడర్‌కు చెందిన దిగువశ్రేణి సభ్యులు.
లొంగిపోయిన వారంతా కూడా క్యూమారి/కిస్కోడే ఏరియా కమిటీలోని వారే. నార్త్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన కెశ్కల్ డివిజన్‌కు అనుబంధంగా ఈ కమిటీ పనిచేస్తోంది. మావోయిస్టులు తమ సరెండర్ దశలో మూడు ఎకె 47లు , రెండు ఇన్సాస్ రైఫిల్స్, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, .303 రైఫిల్స్ ఆరు, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, బారెల్ గ్రెనెడ్ లాంఛర్లు అధికారులకు అప్పగించారు. ఇటీవలి రోజులలో నక్సలైట్ల అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న వంటివారితో దాదాపుగా 300 మంది వరకూ సరెండర్ అయ్యారు.
జనజీవన స్రవంతిలో కలిశారు. భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల బెడదను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలోనే నిర్మూలించడం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చేస్తున్న ప్రకటనల దశలోనే సరెండర్ల పర్వం జోరందుకుంది. భారీ స్థాయిలో పట్టిస్తే పారితోషికాలు ఉన్న వారు, పలు కీలక దాడులలో ప్రధాన వ్యూహకర్తలు కూడా వరుసగా సరెండర్ కావడం అడవుల్లో సంచలనానికి దారితీసింది.