మనతెలంగాణ/హైదరాబాద్ : మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కెసిఆర్ తెలంగాణలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జహీరాబాద్ పరిధిలో ఉన్న మైనారిటీ గురుకులాల నుంచి ఎంబిబిఎస్ సీట్లు సాధించిన 16 మంది విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి కెటిఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1,022 గురుకులాలను కెసిఆర్ ఏర్పాటు చేశారని, నేడు వాటి నుంచి ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా తయారవుతున్నారని తెలిపారు. కెసిఆర్ చొరవ వల్లనే భారతదేశంలో తెలంగాణలో తెల్లకోటు విప్లవాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
2014లో కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే తమ ప్రభుత్వ హయాంలో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం జహీరాబాద్ నుంచే 16 మంది ఎంబిబిఎస్ సీట్లు సాధించడం గర్వంగా ఉందని అన్నారు. మైనార్టీ గురుకులాల్లో ఫలితాలు ఎంతో గొప్పగా ఉన్నాయనడానికి ఈ 16 మంది విద్యార్థులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అనేక రంగాల్లో దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు.
మంచి విద్యా అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్క పేద తల్లిదండ్రి తమ బిడ్డలకు విద్య అందించేందుకు సంసిద్ధంగా ఉంటారని కెసిఆర్ ఆ రోజు చెప్పారని పేర్కొన్నారు. ఆ తల్లిదండ్రుల కల నెరవేర్చే విధంగా, ఒక ఆటో డ్రైవర్ కుమార్తె, ఒక జర్నలిస్టు కుమార్తె, ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కుమార్తె తమ కుటుంబంలో తాను మొదటిసారి డాక్టర్ అవుతున్నారని చెబుతున్నారని, ఈ ఘనత కచ్చితంగా కెసిఆర్‌కే దక్కుతుంది అన్నారు. ఒక్క దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించి చీకట్లను తరిమి వేసినట్లుగా, ప్రభుత్వ సహకారంతో డాక్టర్లుగా మారిన వారు ఇతరులకు సహాయం చేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.