లక్నో: కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందై మరో స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. యుపికి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కల్ స్లీపర్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదివారం ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తున్న ఓ ఎసి బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేసి అందరు ప్రయాణికులను కిందికి దింపేశారు. వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల తెలిపారు. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఎలాంటి ప్రాణా నష్టం కానీ, గాయాలు కావడం కానీ జరగలేదన్నారు. ప్రమాదం నుంచి కాపాడిన డ్రైవర్ జగత్ సింగ్‌ను ప్రశంసించారు.