న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు వన్డే సిరీస్‌లో షాక్ తగిలింది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన టి-20 సిరీస్‌ని 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసింది. మౌంట్ మాంగనూయ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 26) జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ శతకంతో 35.2 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో జెమీ ఓవర్టన్‌తో కలిసి బ్రూక్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 101 బంతుల్లో 9 ఫోర్లు 11 సిక్సులతో 135 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఓవర్టన్(46) కూడా బ్రూక్‌కి సహకారం అందించాడు.
అయితే ఈ స్వల్పలక్ష్య చేధనలో న్యూజిలాండ్ కూడా ఆరంభంలో తడబడింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్(78), బ్రెస్‌వెల్(51)లు కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్ 36.4 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.