అమరావతి: మొంథా తుఫాన్ దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. తుపాన్ నేపథ్యంలో కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్ తాత్కాలికంగా మూసివేశారు. తుఫాన్ ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ కృష్ణ చైతన్యను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వాయుగుండం రేపటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులతో పాటు ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జులను ప్రభుత్వం నియమించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.