మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ క ళాశాలలకు 202528 కాలానికి కొత్త ఫీజుల ఖరారు వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇంజనీరిం గ్, వృత్తి విద్యా కళాశాలల ఫీజులపై శనివారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) సమావేశం జరిగింది. సోమవారం మరోసారి నిర్వహించి ఫీజులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ తర్వాత ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ సారి ఫీజుల పెంపు భారీగా ఉండకపోవచ్చనీ ర్యాంకింగ్, న్యాక్, పరిశోధనలు తదితర నూతన కొలమానాల ఆధారం గా ఫీజులు నిర్ణయించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నా యి. ఇంజినీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి
టిఎఎఫ్‌ఆర్‌సి ఇప్పటికే ప్రాథమికంగా ఫీజులపై ఓ నిర్ణ యం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఫీజులపై విస్తృత కసరత్తులు చేశారు. టిఎఎఫ్‌ఆర్‌సి అధికారులు దాదాపు 160 కళాశాలల ప్రతినిధులతో పునర్విచారణ సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొత్త ఫీజులు ఖరారు చేశారు. దీని ప్రకారం అధిక శాతం కళాశాలలకు స్వల్పంగా, కొన్నింటికి గరిష్ఠంగా 20 నుంచి 30 శాతం మించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కళాశాలలు తమ ఫీజు ఖరారులో అన్యాయం జరిగిందని న్యాయస్థానానికి వెళ్లినా, శాస్త్రీయ ఆధారాలు చూపేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తె లుస్తోంది. మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, బి.ఇడి, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజులను సవరించాల్సి ఉంటుంది. ఆయా కళాశాలల ఆదా య, వ్యయాలను పరిశీలించి సాధారణంగా టిఎఎఫ్‌ఆర్‌సి కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది.
ఈ ప్రక్రియలో భాగంగా ఈసారి విద్యా నాణ్యత కోసం ఆయా కళాశాలల్లో అంతర్గత నాణ్యత పెంపు విధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థులకు, సిబ్బందికి ముఖగుర్తింపు హాజరు, పా రదర్శకత, జవాబుదారీతనం కోసం వేతనాలు తదితర వాటి చెల్లింపునకు ఆధార్ అధీకృత విధానం, పరిశోధనలు,స్టార్టప్ లు, పరిశోధన పత్రాలు, జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. గ తంలో కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టిఎఎఫ్‌ఆర్‌సికి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి.