జన్నారం మండలం చింతగూడలో శనివారం సుమారు 3 గంటల ప్రాంతంలో అనుమానంతో సూర అశోక్ అనే వ్యక్తి భార్య సూర అనితను బీడీల కత్తెరతో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ఈ సంఘటన చింతగూడలో కలకలం రేపింది. రక్తం మడుగులో అనిత కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ౧౦౮ సిబ్బంది చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీడీల కత్తెరతో మెడ పై, పలు చోట్ల కడుపులో పొడిచినట్లు 108 సిబ్బంది తెలిపారు వివరాలలోకి వెళితే… జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లికి చెందిన సూర అశోక్‌తో 5 సంవత్సరాల క్రితం జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన అనితతో వివాహం అయింది.
ప్రస్తుతం ఈ దంపతులకు 4 సంవత్సరాల బాలుడు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి భార్యభర్తల మధ్య తరచుగా కొట్లాటలు జరిగాయని, కొన్ని సార్లు పెద్దలు సర్ది చెప్పడంతో ఇక నుంచి గొడవలు చేసుకోబోమని కలిసిమెలిసి ఉంటామని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఆర్దిక పరిస్ధితులా..?, లేదా భార్యపై ఉన్న అనుమానమా.? అనేది తెలియడం లేదు. సంవత్సరం క్రితం భార్యభర్తలు కోపతాపాలను పక్కన పెట్టి పని చేసుకోవాలనే ఆలోచనకు రావడంతో భర్త అశోక్ ఏడు నెలల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అశోక్ దుబాయ్ నుంచి మూడు రోజుల క్రితం స్వగ్రామమైన స్తంభంపల్లికి వచ్చి శుక్రవారం జన్నారం మండలం చింతగూడలో తల్లిగారి ఇంట్లో ఉంటున్న భార్య అనిత వద్దకు వచ్చి వెంటనే వెళ్లిపోయాడు. ఆయనకు ఏమి అనుమానం వచ్చిందో ఏమో తెలియదు కాని శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే మళ్లి చింతగూడకు
అశోక్ రావడం ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అనితతో ఏమి మాట్లాడకుండానే బీడీల కత్తెరతో ఇష్టం వచ్చిన చోట పొడిచి బయటకు రావడం ఆమె రక్తపు మడుగులో కింద పడి కేకలు వేయడం, గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడం, ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. భార్యను హత్యయత్నానికి యత్నించడం కేవలం అనుమానమేనని ప్రచారం జరుగుతుంది. భార్యపై చేసిన దాడిలో సైతం భర్త అశోక్ చేతులకు గాయాలైనట్లు తెలిసింది. ఆయన సైతం ప్రస్తుతం జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనుష తెలిపారు. ఈ కత్తిపోట్లు చింతగూడలో కలకలం రేపింది. ఈ విషయంలో ఎస్సై అనుషను సంప్రదించగా ఇప్పటికి ఎలాంటి పిర్యాదు రాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత వద్దకు వెళ్లి పిర్యాదు తీసుకుంటామని తెలిపారు.