నిజామాబాద్‌లో బిఆర్‌ఎస్ లీడర్ల కుట్రల వల్లే నా ఓటమి జరిగిందని, ఇది కుట్రనా.. కాదా.. ఆలోచించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జాగృతి జనం బాట ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆమె నిజామాబాద్ చేరుకున్నారు. ఆమెకు ఇందల్వాయి వద్ద జాగృతి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయానికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌లో తనపై ఏం కుట్ర జరిగిందో చిన్నపిల్లలను అడిగినసరే చెబుతారని పేర్కొన్నారు. ‘ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న మీద, బిఆర్‌ఎస్ మీద ప్రేమతో భరించా, కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా.. తొలి అడుగు నిజామాబాద్ గడ్డ మీది నుంచే అని వచ్చా’ అని అన్నారు. ఇక 5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయానని, ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉందని తెలిపారు. ఎక్కడ ఉన్నా తన మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు వచ్చి 20 సంవత్సరాలు మొత్తం తెలంగాణ కోసం, ఉద్యమం కోసం, కెసిఆర్ కోసం, బిఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేశానని తెలిపారు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉన్నానని అన్నారు. నిజామాబాద్ జిల్లా కోడలిగా, బిడ్డగా తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. తాను బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, కానీ తనను కుట్ర చేసి పంపించారని..ఈ విషయం నిజామాబాద్‌లో ఉన్న బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరారు. ‘బిఆర్‌ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. ఇన్నాళ్లు కెసిఆర్ నీడలో ఉన్నా.. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నా.. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు… ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలి’ అని కోరారు. ‘మన అక్కాచెల్లెలు ప్రతి విషయంలో కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రూ.2,500 పెన్షన్ ఇస్తలేదని, పెన్షన్ కోసం ప్రభుత్వంపై పిడికిలి బిగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోందని అన్నారు. గత పదేళ్లలో మనం కొంత సాధించుకున్నామని, కానీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. కోటి రూపాయలు వచ్చే వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేశామని అన్నారు. ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు రావాలె. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా పెన్షన్ రావాలని అన్నారు. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతానని ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేస్తామని పేర్కొన్నారు. ఇక పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లో పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఇక గురుకులాల్లో ఆత్మహత్యలు, ఎలుకలు విద్యార్థులను కొరకటం, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతోందని దుయ్యబట్టారు. ఈ జిల్లాకే చెందిన పిసిసి ప్రెసిడెంట్‌మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదని మండిపడ్డారు. సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేకపోతున్నారని అన్నారు.