కరడుకట్టిన పాతనేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కత్తితో తెగబడటంతో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా ఓ నేరస్థుడు తీవ్రంగా గాయపడగా, మరొకరు తప్పించుకున్నాడు. గాయపడి పట్టుబడిన నేరస్థుడిని ఆసుపత్రికి తరలించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన రాజధాని నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి….శనివారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో సౌత్‌ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ హైదరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశం నుంచి తన కార్యాలయానికి వెళ్తుండగా, చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే రౌడీషీటర్ కామాటిపురకు చెందిన ఉమెర్ అన్సారీతోపాటు మరో వ్యక్తి అక్కడ అనుమానాస్పదస్థితిలో సంచరిస్తున్నారు. దీన్ని పసిగట్టిన డిసిపి చైతన్యకుమార్ వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోతుండటంతో పోలీసులు వెంటాడారు.
ప్లేగ్రౌండ్ వెనకాల నున్న గల్లీలో దుండగులను పట్టుకోవడంతో చాకుతో తిరగబడ్డారు. డిసిపి,గన్‌మెన్‌లపై దాడికి యత్నించి ప్లేగ్రౌండ్ ప్రహారి గోడ దూకి పారిపోతుండగా డిసిపి చైతన్యకుమార్ దుండుగులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రౌడీషీటర్ ఉమెర్ అన్సారీ భుజం, కడుపులో బుల్లెటు గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. మరో దుండగులు పరారయ్యాడు. గాయపడిన అన్సారీని బంజారాహిల్స్‌లోని ఓప్రైవేటు అసుపత్రికి తరలించారు. ఈఘటనలో గాయపడిన డిసిపి చైతన్యకుమార్, గన్‌మెన్‌ను మలక్‌పేట్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, డిసిపిలు శిల్పవల్లి, స్నేహామెహ్రా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన తీరు పరిశీలించారు. కాల్పుల్లో గాయపడిన రౌడీషీటర్ అన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు.
రౌడీషీటర్ ఉమెర్ అన్సారీపై 25 కేసులు
కామాటిపురకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీపై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయినా కూడా నేరాలు చేయడంతో పోలీసులు 2016,2020లో రెండుసార్లు పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన నిందితుడు మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. ఉమెర్ అన్సారీపై టపాచపుత్ర, కామాటిపుర, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి, చార్మినార్ , బహదుర్‌పుర, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, హుస్సేనీ ఆలం, ఫలక్‌నూమ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. పిడి యాక్ట్ పెట్టడంతో రెండేళ్లు జైలులో ఉన్నాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి డాగర్లు, కత్తులు గతంలో స్వాధీనం చేసుకున్నారు.
రౌడీలు, చైన్ స్నాచర్స్ ఉక్కుపాదంః విసి సజ్జనార్, హైదరాబాద్ సిపి
రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. రౌడీషీటర్ దాడి చేయడంతో డిసిపి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలిపారు. రౌడీషీటర్ మొబైల్స్ స్నాచర్, ఇద్దరు వ్యక్తులు స్నాచింగ్ చేస్తుండగా డిసిపి చైతన్యకుమార్ పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసేందుకు యత్నించాడని తెలిపారు. దొంగ డిసిపి గన్‌మెన్‌పై కత్తితో దాడి చేయడంతో వెంటనే డిసిపి చైతన్య కుమార్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. దొంగకు భుజం, కడుపులో గాయాలయ్యాయని తెలిపారు. డిసిపి, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. రౌడీషీటర్ ఉమర్ అన్సారీ చేస్తున్న నేరాలకు సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.