రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25వ తేదీ అర్థరాత్రి లోపు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను ఐఎఫ్‌ఎంఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆర్థికశాఖ ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు నమోదు చేయకపోతే ఈ నెల జీతం రాదని ఇప్పటికే ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వశాఖల అధిపతులకు ఆదేశాలను జారీ చేసింది.
అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వారి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10వ తేదీ వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 16వ తేదీ వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలోనే వివరాలివ్వని వారి జీతాలను ఈ నెల బిల్లులను నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని లేకపోతే ఇదే ట్రీట్‌మెంట్ అమలవుతుందని ఆర్థికశాఖ హెచ్చరించింది.