ఫేస్ చూసి మోసపోవద్దు
హైదరాబాద్ సిపి ఫొటోతో సైబర్ నేరస్థుల మోసాలు
నమ్మవద్దని కోరిన సిపి విసి సజ్జనార్
మన తెలంగాణ/ సిటిబ్యూరో: తన ఫొటో పెట్టి సైబర్ నేరస్థులు డబ్బులు వసూలు చేస్తూ మోసాలు చేస్తున్నారని, ఫేస్ చూసి మోసపోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కోరారు. సైబర్ నేరస్థులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఫొటోను వాట్సాప్ డిపిగా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు. కమిషనర్‌కు తెలిసిన వారికి మెసేజ్‌లు పంపి డబ్బులు అడుగుతున్నారు.
ఈ విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన ఫొటోతో ఉన్న వాట్సాప్ డిపితో వచ్చిన సందేశాలను నమ్మవద్దని, అవి నకలీ ఖాతాలని, మోసపూరితమైనవని, ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. డబ్బులు అడిగితే పంపవద్దని, నకిలీ వాట్సాప్ ఖాతాల గురించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.