ఆగ్రా: ఆగ్రాకు చెందిన ఇంజినీర్ అంశుగుప్తా (40) మద్యం మత్తులో స్పీడ్‌గా కారు నడుపుతూ పాదచారులపై దూసుకుపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కారు స్పీడ్‌గా దూసుకువచ్చి రోడ్ డివైడర్‌ను ఢీకొనడంతో రోడ్డు పక్కన నిలబడి ఉన్న పాదచారులు ఏడుగురు ప్రమాదానికి గురయ్యారు. మృతులు బాబ్లీ (33), భాను ప్రతాప్ (25), కమల్ (23), క్రిషి (20), బంటేష్ (21)గా గుర్తించారు. మృతుడు భాను ప్రతాప్ పార్శిల్ డెలివరీ ఏజెంట్‌గా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మృతులు కమల్, క్రిషి స్నేహితులు. శనివారం క్రిషి ఢిల్లీకి వెళ్లవలసి ఉండగా, వీరిద్దరూ కలిసి ప్రయాణం చేయాలనుకుని ప్లాను చేశారు. కానీ ఇంతలోనే ప్రమాదానికి బలయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదనతో చెప్పారు. ఆగ్రాకు చెందిన కారుడ్రైవర్ అంశుగుప్తా (40) నోయిడా లోని ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దీపావళి పండగ కోసం ఆగ్రాకు వచ్చాడు. ప్రమాద సమయంలో అంశు బాగా మద్యం సేవించి మత్తులో ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు.