న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై జీవిత బీమా సంస్థ స్పందించింది. ఈ పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీవిత బీమా సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం వెలువరించింది. ప్రభుత్వ అధికారులు రూపొందించిన ప్రణాళిక ప్రకారమే భారీగా పెట్టుబడులు పెట్టడమైందని ఆరోపించింది.
దీనిపై ఎల్‌ఐసీ స్పందిస్తూ ఈ ఆరోపణలు నిరాధారమని, ఇందులో ఆర్థిక మంత్రిత్వశాఖ గానీ, ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని స్పష్టం చేసింది. ఎల్‌ఐసీ బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారమే పెట్టుబడులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడమవుతుందని పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు ఎల్‌ఐసీ పాటిస్తూ వస్తోందని, అలాంటి సంస్థపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది. దేశం లోని టాప్ 500 కంపెనీల్లో ఎల్‌ఐసికి పెట్టుబడులు ఉన్నాయి.
2014లో ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం ఈమొత్తం 15.6 లక్షల కోట్లకు అంటే గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. అదానీ సంస్థ ఒక్కటే కాదు, రిలయన్స్, ఐటీసీ, టాటా గ్రూపు కంపెనీల్లోనూ ఎల్‌ఐసీకి భారీ మొత్తంలో వాటాలు ఉన్నాయి. అదానీ గ్రూపులో 4 శాతం వాటా అంటే రూ. 60 వేల కోట్ల పెట్టుబడి ఉండగా, రిలయన్స్‌లో 6.94 శాతం వాటా అంటే రూ.1.34 లక్షల కోట్లు, ఐటీసీలో 15.86 శాతం (రూ. 82,800 కోట్లు ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 4.89 శాతం (రూ. 64,725 కోట్లు, ఎస్‌బీఐలో 9.50 శాతం (రూ. 79,361 కోట్లు ) పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన ఐటీ సేవల సంస్థ టిసీఎస్‌లోనే 5.02 శాతానికి సమానమైన రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు ఎల్‌ఐసీకి ఉన్నాయి.