గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయాన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బల్మూరి వెంకట్ శనివారం నారాయణగుడా పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కవిత ఆరోపణలపై చర్యలు తీసుకుని, బిఆర్‌ఎస్ నేతలు దోచుకున్న ప్రజాధనాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతిలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు, మాజీ ఎంపి సంతోష్ కుమార్, ఇతర నాయకులు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్‌పై ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట బిఆర్‌ఎస్ ఆరోపిస్తూ హడావుడి చేస్తున్నదని, నిజానికి రాష్ట్రాన్ని దివాళ తీయించి బాకీల పాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు దోచుకుని దాచుకున్న సొమ్ముతో తెలంగాణ బాకీలన్నీ తీరుతాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.