హైదరాబాద్: అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేక పోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉద్యమకారుల కోసం పోరాడలేక పోయానని అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రిగా లేకపోయినా ఎంపిగా.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగానని, ఉద్యమకారులకు న్యాయం జరిగేవరకు పోరాడనందుకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులరని, వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని తెలియజేశారు.
ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో, పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలని కవిత సూచించారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పామని, కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పామని, 580 మందికి మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారు. మిగతా వారికి న్యాయం చేయలేదని, అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ చెప్తున్నానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.