ఇప్పుడు స్లీపర్ బస్సుల పేరు చెబితే భయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం (24.10.25) తెల్లవారు జామున చెలరేగిన మంటలు అనేక మందిని సజీవ దహనం చేసిన సంఘటన స్లీపర్ బస్సుల నిర్వహణ లోపాలకు సాక్షంగా మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా, పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాల కారణంగానే కొన్ని దేశాల్లో స్లీపర్ బస్సుల వినియోగాన్ని బాగా తగ్గించేశారు. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోవడంతో 2012 లో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. మన దేశంలో స్లీపర్ బస్సులు చాలా పాప్యులర్ పొందాయి. చాలా మంది ప్రయాణికులు తమ సుదీర్ఘ ప్రయాణంలో ఈబస్సుల్లో హాయిగా నిద్రపోవచ్చని ఇష్టపడుతుంటారు.
కానీ తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో వీటి భద్రతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు సాధారణంగా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లకు అధికారికంగా అనుమతించడం లేదు. కానీ చాలామంది ఆపరేటర్లు స్థానిక నిబంధనలను పక్కన పెట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తమ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేయించి ఈ రాష్ట్రాల్లో నడుపుతున్నారు. ఈ వక్ర మార్గాలు నిజంగా భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా లేదా అన్న సందేహాలకు దారితీస్తున్నాయి. ఘోర ప్రమాదాలకు దారి తీస్తున్న స్లీపర్ బస్సుల భద్రత ప్రమాణాలను కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ అధికారుల ప్రస్తుత కర్తవ్యం. భద్రతా ప్రమాణాలతో ఫ్యాక్టరీలో తయారైన బస్సులనే రోడ్లపైకి అనుమతించాలి. అత్యధిక లాభాల కోసం అనధికారికంగా బస్సుల డిజైన్లను ఆపరేటర్లు మార్చకుండా నియంత్రించాలి. అలాగే రెగ్యులర్‌గా వీటిపై తనిఖీలు జరగాలి. స్లీపర్ బస్సుల్లో ఓవర్ లోడ్‌ను అనుమతించరాదు.
ఎన్ని సౌకర్యాలు ఉన్నా ప్రాణాలకు రిస్కుగా మారకూడదు. బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పొగకమ్ముకోవడం ప్రయాణికులకు ఊపిరాడక వెంటనే తప్పించుకునే దారి కనిపించడం లేదు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోతోంది. స్లీపర్ బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరంగా తప్పించుకునే ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయో మొదట తప్పనిసరిగా పరిశీలించుకోవడానికి బదులు కేవలం తమ సౌకర్యాలపైనే ప్రయాణికులు దృష్టి పెడుతున్నారు. మొదట్లో కొన్ని మాత్రమే స్లీపర్ బస్సులుండేవి. అయితే ట్రావెల్ ఆపరేటర్లు చాలామంది తమ మామూలు సీటింగ్ బస్సులను కూడా స్లీపర్ కోచ్‌లుగా మార్చేసి అత్యధికంగా ఛార్జీలు పిండుకోవడం ప్రారంభించారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలతో తయారైన బస్సులను ప్రైవేట్‌గా తమ ఇష్టం వచ్చినట్టు ఆపరేటర్లు వాటి డిజైన్ మార్చేయడం పరిపాటి అయింది. బస్సు కిటికీలు తరచుగా మూసి ఉంటాయి. బస్సులో టివి స్క్రీన్లు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్ కనెక్షన్లకు ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం తదితర హంగులు ఉండడంతో పవర్ లోడ్ అధికమై షార్టు సర్కూట్ సంభవించి మంటలు చెలరేగే ప్రమాదాలు ఎదురవుతుంటాయని కొందరు ప్రయాణికులు చెబుతుంటారు.
బస్సులో ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒకే ద్వారం తెరిచి ఉంటుంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉండడంతో బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల నుంచి బయటపడడం కష్టమవుతోంది. ఈ బస్సుల్లో 30 నుంచి 36 వరకు బెర్త్‌లు ఉంటాయి. ఒక్కో బెర్తు 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. ఈ బెర్తులను అనుసంధానించే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడమే అసలు సమస్య. రాత్రివేళల్లో ఇవి అత్యంత స్పీడ్‌తో వెళ్తుండడం డ్రైవర్లకు అగ్నిపరీక్షే. డ్రైవర్లకు ఏమాత్రం అలసట వచ్చినా, మగత కమ్మినా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. రాత్రుళ్లు డ్రైవింగ్ సమయంలో 25 శాతం మంది నిద్రమత్తులో ఉంటున్నట్టు 2019 లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల లోపు డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకునే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ధోరణిని అరికట్టడానికి కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతిక వ్యవస్థలను కొన్ని నగరాల్లో వినియోగిస్తున్నారు.
పుణె వంటి నగరాల్లో డ్రైవర్లు మగతగా ఉన్నారా లేదా పరధ్యానంలో ఉన్నారా లేదా సిగ్నల్ దాటుకుని స్పీడ్‌గా వెళ్తున్నారా? అని పసికట్టి హెచ్చరించే స్మార్ట్ కెమెరాలు వినియోగిస్తున్నారు. డ్రైవర్ ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో తెలిసిపోతుంది. రెడ్ లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఏ విధంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తునాడో పసిగడతాయి. అలాంటి సమయాల్లో కీచుమని శబ్దం రూపంలో, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారా హెచ్చరికలు వస్తుంటాయి. ఇటువంటి ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కొత్తగా బస్సుల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నా వాటి పనితీరు సామర్థంపై ఇంకా అనుమానాలు ఉంటున్నాయి. కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేయడం చెప్పుకోతగ్గ విశేషం. దీంతో దేశం లోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ఈ ప్రక్రియను దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయడానికి కేంద్రం యోచిస్తోంది.