నిజామాబాద్ జిల్లాలో ఏళ్ల తరబడిగా సాగుతున్న వంతెనల నిర్మాణాలు రాజకీయ రగడకు దారితీస్తున్నాయి. ఇద్దరు దిగ్గజ నేతలు ఒకరి మీద ఒకరు ఉరుముతున్నారు. నిజామాబాద్ నగర శివారులో రెండు వైపుల సాగుతున్న రెండు వంతెనల నిర్మాణాల్లో జాప్యం రెండు జాతీయ పార్టీల నేతల మధ్య రాజకీయ రచ్చకు తెరలేపాయి. ఈ వివాదం ఇప్పుడు ఎంపి అర్వింద్ వర్సెస్ పిసిసి చీఫ్ మహేశ్‌గా మారింది. వారం రోజుల గడువులో జిల్లా పర్యటనకు వచ్చిన ఈ ఇద్దరు నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనే ఇద్దరి నేతల మధ్య మాట యుద్ధానికి దారి తీసినట్లయింది. పదిహేను రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వంతెనకు అవసరమైన నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్షకు దిగుతాననంటూ ఎంపి అర్వింద్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నిజామాబాద్ శివారు ప్రాంతాలైన మాధవనగర్, ఆర్సపల్లిలో రైల్వేట్రాక్‌లపై రెండు వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే నిధులు మంజూరు చేసింది. కానీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు కూడా అనివార్యం కావడం వంతెనల నిర్మాణానికి శాపంగా మారింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే వంతెనలు ప్రారంభమయ్యాయి.
పనులు మొదలైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు క్లియర్ కావడంలో పేచి మొదలైంది. దీంతో గుత్తేదారు తరచూ పనులను నిలిపివేస్తూ వచ్చారు. సహజంగానే నిర్మాణం జరుగుతున్న పనుల జాప్యంపై ప్రజల్లో అసహనం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపి అర్వింద్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఈ వంతెనలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయించారు. ఆ తర్వాత కథ షారా మామూలైంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయడం లేదంటూ బిజెపి నేతలు గత పది రోజుల క్రితమే మాధవనగర్ వంతెన వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ మొండి వైఖరిని బిజెపి నేతలు ఎండగట్టారు. వారం రోజుల గడువులోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్ నగరానికి వచ్చారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి దినకర్మకు వచ్చిన సిఎం రేవంత్‌రెడ్డి కలవడానికి బిజెపి ఎంఎల్‌ఎ ఏకంగా రోడ్డు మీదే బైఠాయించారు.
చివరికి రేవంత్ కలిసి ఇదే విషయమై వినతి పత్రం ఇచ్చారు. బిజెపి నేతలు బైఠాయించిన ఘటనపై మరుసటి రోజు పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. అర్వింద్‌ను టార్గెట్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఇప్పించాలన్నారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతోనూ వంతెన పనుల పురోగతిని ఆరా తీశారు. రెండు రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఎంపి అర్వింద్ సైతం మహేశ్ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మాధవనగర్ ఒక్కటే కాదు జిల్లా లో కేంద్రం వాటా నిధులు మంజూరు అయినా పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఎలా జాప్యం చేస్తుందో ఏకరువు పెట్టారు. మాధవనగర్ వంతెన పనులు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఆగిపోయాయని పది రోజుల్లో నిధులు ఇవ్వకపోతే ఎంపిగా తానే నిరాహార దీక్షకు దిగుతానని అర్వింద్ అల్టిమేటం ఇచ్చారు.
అసలు తాను ఇప్పటి దాకా ఎప్పుడు దీక్ష చేయలేదని కానీ వంతెన నిధులకు తప్పడం లేదని చెప్పారు. అర్వింద్ ఎదురు దాడికి ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ మాత్రం రాలేదు. మాధవనగర్ రైల్వేట్రాక్ వద్ద వంతెన పనులు ఏళ్ల తరబడిగా సాగుతుండడంతో రోజు హైదరాబాద్ వైపు వెళ్లే వేలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఎంపి అవ్వకముందే అర్వింద్ మాధవనగర్ వద్ద రైల్వే వంతెన డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆయన ఎంపి అవ్వగానే ఆరు నెలలోనే నిధులు మంజూరు చేయించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం మెలికపెట్టింది. దీనితో అప్పటి నుంచే ఈ వంతెన రాజకీయ రచ్చకు వేదిక అయింది. ఆర్ అండ్‌బి మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తే అయినా వంతెన ఖ్యాతి అర్వింద్ రాకుండా సర్వశక్తులు ఒడ్డారు.
కానీ అప్పట్లోను అర్వింద్ మరోసారి ఈ నిధుల కోసం రోడ్డెక్కడానికి సిద్ధం అయ్యారు. దీనితో ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కానీ టెండర్ల ప్రక్రియ దాటుకొని పనులు మొదలు కావడంలో నెలల తరబడి జాప్యం జరిగింది. పనులే ఆలస్యంగా మొదలు పెట్టించిన సర్కార్ గుత్తేదారుకు నిర్ణీత కాలంలో బిల్లులు క్లియర్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపి అర్వింద్ నేరుగా సిఎం రేవంత్‌ను కలిసి గుత్తేదారుకు పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేయించారు. దీనితో ఆరు నెలలు పనులు శరవేగంగా సాగాయి. ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆరు కోట్ల రూపాయల మేరకు బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వేగంగా మంజూరు చేస్తూ పనులు చేయిస్తే కేంద్రం కూడా నిర్ణీత గడువులోనే నిధులు మంజూరు చేస్తుందని అర్వింద్ చెప్తున్న మాట. కానీ కేంద్రం ఇవ్వాల్సిన ఫండ్‌ను ఇవ్వకపోవడం వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయనేది అధికార పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం రాజకీయ రగడగా మారింది. అర్వింద్ అల్టిమేటం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనన్నదే ఆసక్తిగా మారింది.
– ఎ. రామకృష్ణ ప్రసాద్
94410 41433
(నిజామాబాద్ బ్యూరో)