హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై నటి రష్మిక మందనా, నటుడు సోనూసూద్, స్పందించారు. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాజకీయ ప్రముఖులు, నటులు సంతాపం తెలిపారు. బస్సు మంటల్లో చిక్కుకొని కాలిపోయే ముందు ప్రయాణికులు ఆర్తనాదాలు వింటే భయంకరంగా ఉందని రష్మిక తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన తెలియగానే తన హృదయం ముక్కలైందని, మండుతున్న బస్సులో ప్రయాణికులు అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేమన్నారు. చిన్న పిల్లలతో సహా ఓ కుటుంబం సజీవదహనమైందన్నారు. కుటుంబ సభ్యులు కోల్పోయిన వారికి రష్మిక ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
15 రోజుల వ్యవధిలో బస్సు ప్రమాదాల్లో 40 మంది మృతి చెందారని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు చాలు అని, ఇప్పటికైనా కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.