అమరావతి: మొంథా తుపాను దూసుకొస్తుడడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొంథా తుపాను ఎపిలో బీభత్సం సృష్టించనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఆదివారం అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు తదితర పనులను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. శనివారం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి.