మహారాష్ట్రలో దారుణం జరిగింది. సతారా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బలవన్మరణానికి ముందు ఆమె తన అరచేతిలో రాసుకున్న సూసైడ్ లేఖలో సంచలన విషయాలు వెల్లడించింది. ఓ ఎస్‌ఐ తనపై ఐదు మాసాలుగా అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌ఐ గోపాల్ బదానేతో ప్రశాంత్ బన్‌కర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా తనను వేధిస్తున్నారని తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన 28 ఏళ్ల వైద్యురాలు బీడ్ జిల్లా వాసి. గురువారంనాడు రాత్రి ఫల్టాన్‌లోని ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఎస్‌ఐతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారం, ఆత్మహత్యకు పురిగొల్పడం సంబంధిత కేసులు నమోదు చేశారు. వైద్యురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె చేతిపై ఉన్న సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో మార్పులు చేయాలని ఒత్తిడి వస్తున్నట్లు వైద్యురాలి బంధువులు ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై సిఎం ఫడ్నవీస్ స్పందించారు. వెంటనే సతారా జిల్లా ఎస్‌పికి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యురాలి ఆత్మహత్యపై కాంగ్రెస్, శివసేన స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆక్షేపించాయి.