తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం(అక్టోబర్ 25) నుంచి ‘జనం బాట’ పట్టనున్నారు. ప్రజలు, మేధావులు, విద్యావంతులతో మమేకం కానున్నారు. జాగృతి జనంబాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 33 జిల్లాల్లో కొనసాగనున్న ఈ యాత్రను శనివారం ప్రారంభించనున్నారు. కవిత తన నాలుగు నెలల ’జనం బాట’ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సమస్యల మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకుంటారు. ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
మొదటి రోజు నిజామాబాద్‌లో పర్యటన
జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదటి రోజు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుని, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనతరంత నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.