మెదక్ జిల్లా, నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో చదువుతున్న 8 మంది ఇంటర్ విద్యార్థినులను ఎలుకలు కరవడం శుక్రవారం కలకలం రేపింది. గురుకుల వసతి గృహంలో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కాలు మడమ దగ్గర కరిచాయి. వీరితోపాటు పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థినులకు చర్మంపై దురద రావడంతో వారిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న నికిత, జ్యోతి, ఉష, గీతాంజలి, సంధ్య, అశ్విత మరో ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి.
ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ లలితాదేవిని వివరణ కోరగా.. హాస్టల్లో ఎలుకల బెడద విపరీతంగా ఉందని, రాత్రి సమయంలో తనపై నుంచి కూడా ఎలుకలు తిరుగుతున్నాయని అన్నారు.. ఎలుకలే కాకుండా కోతులు కూడా విద్యార్థులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను ప్రభుత్వ దవాఖానకు పంపించి ప్రథమ చికిత్స చేయించామని తెలిపారు. హాస్టల్లో 540 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి సరిపడా సరైన వసతులు లేవని, పడుకోవడానికి సరిపోయినంత స్థలం లేదని, హాస్టల్ చుట్టుపక్కల వ్యవసాయ పంట పొలాలు ఉండడం వల్ల ఎలుకలు, కోతులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.