కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామను జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లా, శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (43), ఆమె కూతురు చందన (23) సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటన వారి కుటుంబీకులను, బంధువులను శోకసంద్రంలో ముంచెత్తింది. మృతుల సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం… సంధ్యారాణి కుటుంబంతో సహా బంధువుల వివాహం కోసం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తన కొడుకు శ్రీ వల్లభ్ ఉత్తరప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదువుతుండటంతో వెంటనే వెళ్లిపోగా ఆమె భర్త ఆనంద్‌కుమార్‌గౌడ్ దుబాయ్ వెళ్లారు. అయితే, సంధ్యారాణి స్వల్ప ఆనారోగ్య కారణంగా దుబాయ్ ప్రయాణం వాయిదా వేసుకుని బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తన కూతురు చందనను బెంగుళూరుకు పంపేందుకు తోడుగా వెళ్లింది. బెంగుళూరు నుంచి సంధ్యారాణి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుని తల్లి, కుమార్తెలు ఇద్దరూ సజీవదహనమయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త, కుమారుడు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబంతో పాటు స్వగ్రామమైన శివ్వాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.