ముంబయి: ఓ వైద్యురాలిపై ఎస్ఐ పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు మరో పోలీస్ అధికారి లైంగికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో బయటకు వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం… బీద్ జిల్లాకు చెందిన ఓ వైద్యురాలు సతారాలోని ఓ ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఫల్టాన్ లో ఓ హోటల్ గదిలో ఆమె ఉరేసుకుంది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి అరచేతిపై రాసిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. ఇద్దరు పోలీస్ అధికారులు వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నానని వివరణ ఇచ్చింది. ఎస్ఐ గోపాల్ బదాన్ అనే పోలీస్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని నోట్ లో పేర్కొంది. మరో పోలీస్ అధికారి ప్రశాంత్ బంకర్ మానసికంగా తనని వేధించాడని వివరించింది. మృతురాలి బంధువులు మీడియాతో మాట్లాడుతూ మరిన్ని ఆరోపణలు చేశారు. తప్పుడు నివేదికలు ఇవ్వాలని వైద్యురాలిపై ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసేవారన్నారు. నకిలీ పోస్టు మార్టమ్ రిపోర్టులతో పాటు రోగం లేకపోయినా ఫిట్ నెస్ రిపోర్టులు ఇచ్చేలా ఆమె ఒత్తిడి తీసుకరావడంతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళ కమిషన్ చీఫ్ రూపాలీ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వెంటనే ఉన్నతాధికారులు ఆ ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.