ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్ కల చెదరిపోయింది. దీంతో కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ప్రపంచకప్‌ల్లో న్యూజిలాండ్ తరఫున ఆడిన సోఫీ.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ అనంతరం వన్డేలకు వీడ్కోలు పలుకుతానని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌పై సోఫీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఇంకా మెరుగుపడాలని.. భారత్‌కు మహిళ ప్రీమియర్ లీగ్ వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.
‘‘భారత్‌లో 150 కోట్ల మంది జనాభ. మాది చిన్నదేశం 5 కోట్ల జనాభా మాత్రమే. భారత్ దేశవాళీ క్రికెట్ వ్యవస్థతో పోలిస్తే మాకు చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే మా దేశ మహిళల క్రికెట్ ఎలా ముందుకు వెళ్తుందో అని ఎదురుచూస్తున్నా. ఆ స్థాయిలో మద్ధతు లభించాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో భారత్ మా కంటే ముందు వరుసలో ఉంటుంది. మహిళల క్రికెట్‌ను సపోర్ట్ ఉంది. డబ్ల్యూపిఎల్‌తో క్రికెట్ గౌరవం పెరిగింది’’ అని సోఫీ పేర్కొంది.
36 ఏళ్ల సోఫీ డివైన్ ఇప్పటివరకు 158 వన్డేలు, 146 టి-20లు ఆడింది. మొత్తం 7,600పైగా పరుగులు చేసింది. అందులో 9 వన్డే సెంచరీలు, ఒక టి-20 శతకం ఉంది. ఇక తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతూ.. తమ దేశంలో చాలా నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని.. తను తప్పుకుంటే కొత్త వాళ్లకు అవకాశం వస్తుందని తెలిపింది. ‘‘ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం జట్టు నుంచి తప్పుకుంటాను. న్యూజిలాండ్ క్రికెట్ నాకు బిడ్డలాంటిది. ఈ జట్టు తరఫున ఆడినందుకు గర్వపడుతున్నా. రాబోయే రోజుల్లో భిన్నమైన పరిస్థితులు ఎదురుకొవాల్సి వస్తుందని తెలుసు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. ఈ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవద్దని అనుకున్నా. కానీ, నాకు చాలా కష్టంగా (భావోద్వేగానికి గురై) అనిపిస్తోంది. ఈ టోర్నీలో చివరి మ్యాచ్ గెలిచి స్వదేశానికి వెళ్తామనే నమ్మకం ఉంది’’ అని సోఫీ తెలిపింది.