దేశంలో జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, అణగారినవర్గాలను అణగాదొక్కే ప్రయత్నాలు, అమాయక బహుజనులపై రాక్షసతత్వం నాటి కన్నా నేడే ఎక్కువగా కనబడుతున్నది. డా. అంబేద్కర్ కాలంలో అంటరానితనం, కులవివక్ష లాంటి మానసిక దాడులుండేవి. నేటి స్వాత్రంత్య్ర భారతంలో వాటితోపాటు భౌతిక దాడులనూ చూస్తున్నాం. దేశంలో ప్రతి రోజు సాధారణ దళిత ప్రజలపై ఎక్కడోచోట ఏదో ఘటన నమోదవుతున్నది. ఇప్పుడు ముఖ్యవ్యక్తులపై దాడులతో ఆధిపత్య కులాల అధిపత్యాన్నిచాటే సంఘటనలు చూడాల్సిన దౌర్భాగ్యం నెలకొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటుదాడి, ఐపిఎస్ పురాన్ కుమార్ కులవివక్ష ఘటనలు ఇలా అనేక ఘటనలు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి. దళితుల ప్రాణాలకు రక్షణ లేదు, దళిత బాలికల, మహిళలపై లైంగిక హింసలు, వారి మానవ విలువలకు లెక్కే లేకుండా పోతుంది.
అందుకే దళితశక్తి దళపతి రూపం దాల్చాలి. బాబా సాహెబ్ మార్గంలో నడిచే విద్యావంతులు, మేధావులు నాయకులుగా తయారవ్వాలి. మానవులను జంతువులుగా చూసే క్రూరమృగాలను రూపుమాపి, మానవత్వమే అసలైన మతం అని చాటి చెప్పి శాంతి మార్గంలో నడిపించే దళపతులుగా ఎదగాలి. ఆనాడు దళితుల హక్కులకై, అసమానతలపై, కులవివక్షకు వ్యతిరేకంగా సుదీర్గ కాలం పాటు పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ నేడు లేరు. నేడు కుల వివక్ష దారుణాలు విచ్చలవిడిగా పెరిగిపోయిన దారుణాలు చూస్తుం టే నాయకత్వ పటిగల అభినవ అంబేద్కరులు ప్రతిచోట పుట్టాలని దళిత వర్గం ఎదురు చూస్తున్నది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలిలో ఒక దళిత యువకుడిని మూకుమ్మడిగా కొట్టి చంపిన వీడియో వైరల్ అవడంతో ఆ రాష్ట్రం మొత్తం అట్టుడుకిపోయింది.
ఇలా చెప్పుకుంటూపొతే దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దళితులు వేరే కులం వారితో పెళ్లి చేసుకున్న సంఘటనల్లో అబ్బాయి, అమ్మాయి అనే తేడా చూడకుండా బట్టలూడదీసి, గుండు గీయించి దాడిచేసే అఘాయిత్యాలను, కొన్ని వికృత చేష్టలను చూస్తే ఒళ్ళు జుగుప్సాకరంగా మారుతుంది. 2022లో మధ్యప్రదేశ్ లో దళిత దంపతులను కొడుకుతో సహా కాల్చి చంపారు. 2025 ఆగస్టులో తమిళనాడులో దళిత పాఠశాల విద్యార్ధిపై మరో వర్గ ముగ్గురు విద్యార్థులు కలిసి కేవలం కుల కారణంగా కత్తులతో దాడి చేయడం దిగ్భ్రాంతికర విషయం. నిన్నగాక మొన్న అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 16 ఏళ్ల దళిత బాలిక అయిదుగురి చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురికావడం ఆమె కుటుంబంలో రక్తం మరిగేలా చేసిందేమో కానీ సమాజంలో కొందరికి చీమకుట్టినంత బాధకూడా కలగక పోవచ్చు! మరో సంఘటనలో మధ్యప్రదేశ్‌లో (2025 మార్చి నెల) ఓ దళిత వరుడు పెళ్ళికి గుర్రంపై వెళ్లినందుకు రాళ్ళతో కొట్టి చంపారు.
మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి వేడుకలలో శబ్దం పెంచి డిజె పాటలు పెట్టారని ఒకేసారి 40 మంది దాడి చేసి రాళ్ళతో కర్రెలతో దాడులు చేసి పెళ్ళి జరగకుండా ఊర్లోకి రానివ్వలేదు. ఇలా చెప్పుకుంటూపోతే వందల వేల ఉదాహరణలు దేశంలో ప్రతి రాష్ట్రం లో చోటు చేసుకుంటున్నాయి. దళితులపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన దేశంమొత్తంలో నమోదైన అట్రాసిటీ కేసులు చూసినట్లయితే 2020లో 50 వేలు, 2021లో 50,744, 2022లో 57428 నమోదైనట్లు అధికారిక నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అధికంగా, తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. మరీ వీటిని ఆపేదెవారు? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత రక్షణ కల్పించినప్పటికీ రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు! దళితులతోపాటు మైనారిటీలపైనా దాడులు జరుగుతున్నాయి. వీటిని ఆపేదెవరు, పరిష్కారం ఎక్కడ? దేశం శాంతి మార్గంలో నడిచేదెప్పుడు, కుల మతాల మంటలు ఆరేదెప్పుడు.? ముందుకు వచ్చే నాయకులెవ్వరు? దళితుల కోసం, పీడిత వర్గాల కోసం పోరాటం చేయడానికి ‘చేగువేరా’ జార్జిరెడ్డి లాంటి నాయకులు మళ్ళీ ఎప్పుడు పుడుతారో అని ఎదురు చూస్తుందీ సమాజం.!
– సయ్యద్ జబి, 9949303079