రౌడీ షీటర్‌ను చిత్తుగా ఓడించండి
ఈ ఎన్నిక హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ కోసం గట్టిగా కృషి చేయాలి
ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలి
అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..
చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలి
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్ రావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ నేతలతో కెసిఆర్ సన్నాహక సమావేశం
ఈ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ గుల్ల అయిందని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో గురువారం సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.
రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది. పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ మార్గనిర్దేశం చేశారు.
ఇంటింటికీ తిరిగి వివరించాలి
జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని తెలిపారు.
బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని సూచించారు. ఓటు అడగడానికి తమ ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించి ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించి వారిని ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దామని, తన ఆలోచనలను అమలు చేసినందుకు ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కెసిఆర్ అభినందించారు.
అటువంటి అత్యున్నత స్థాయి విద్యను హాస్టల్ సౌకర్యాలను అందించిన గురుకులాల్లో పిల్లలు మరణించడం దారుణం, శోచనీయమని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతిని ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కష్టకాలంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల హృదయాలను గెలవాలి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో అసహ్యం ఏహ్య భావం నిండి ఉందని, మోసపోయామనే కోపంలో ప్రజలు ఉన్నారని కెసిఆర్ అన్నారు. సక్కదనంగ నడిసే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నామనే బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో స్పష్టతతో ఉన్నదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ చేసిన మోసం పట్ల రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలుపును ఇప్పడికే ప్రజలు ఖాయం చేశారని చెప్పారు.
భారీ మెజారిటీ సాధించడం కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పని చేయాలని, అందుకు డివిషన్ల వారీ క్లస్టర్ల వారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి హృదయాలను గెలవాలని వివరించారు. అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే తీరుగా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలని అన్నారు.
రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు
జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు. జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.