వాషింగ్టన్: భారతదేశం ఈ ఏడాది చివరికి రష్యా నుంచి చమురును పూర్తి స్థాయిలో కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. భారత్ వైఖరిలో మార్పు వచ్చింది. రష్యా చమురు దిగుమతులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌తో అమెరికా పలు ఒప్పందాలకు దిగుతుందనే తమ వాదనను ట్రంప్ మీడియాకు చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరికి రష్యా కోటాను భారత్ సంపూర్ణ స్థాయిలో నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. వెనువెంటనే ఈ విషయంలో భారత్ ఏమి చేయలేకపోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ దిగుమతి నిలిపివేతకు సమయం పడుతుందన్నారు. ఇక చైనా కూడా ఇదే బాట పట్టాలి. ఈ విషయంలో తాను చైనా నేతలతో మాట్లాడుతానని, రష్యా చమురు నిలిపివేతకు పట్టుపడుతానని కూడా ట్రంప్ చెప్పారు.
ఇంతకు ముందటి వరకూ ట్రంప్ ఏ ప్రెస్‌మీట్‌లో అయినా భారత యుద్ధం నిలిపివేసింది తనే అని చెప్పడం పరిపాటి అయింది. అయితే ఇప్పుడు ఇందుకు మారుగా ఆయన భారత్ ఇక రష్యా చమురుపై ఆధారపడబోదని చెపుతున్నారు. ఈ వాదనను మోడీ , భారత అధికార వర్గాలు తోసిపుచ్చాయి. తమ దేశ ప్రయోజనాల దిశలోనే ఏ విషయంలో అయినా నిర్ణయాలు ఉంటాయని ఎదురుదాడికి దిగుతున్నారు. వీటి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ట్రంప్ మరోసారి ఈ చష్యా చమురు వ్యవహారం వెలుగులోకి తీసుకువచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్థానికి రష్యాకు భారీ స్థాయి నిధులు చమురు అమ్మకాల ద్వారానే దక్కుతోందని ట్రంప్ చెప్పారు. తాను ఇప్పటికే తన వాదనను మోడీకి వివరించానని ఇక త్వరలోనే చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌తో భేటీలో ప్రస్తావిస్తానని, ముందుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిలిపివేత ప్రధానం అని చెప్పారు.