అడిలైడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ ఓవెల్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో 17 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీం ఇండియాను ఓపెనర్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌ల జంట ఆదుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 118 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించాడు. రోహిత్ 97 బంతులు ఎదురుకొని 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 73 పరుగులు చేసి ఔట్ కాగా.. అయ్యర్ 77 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
వీరిద్దరి వికెట్ల తర్వాత అక్షర్ పటేల్ రాణించాడు. 41 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా(24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆసీస్ బౌలింగ్‌లో జంపా 4, బార్ట్‌లెట్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు.