ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 2030 సంవత్సరం నాటికి కంపెనీ తన కేంద్రాల్లో సుమారు 6 లక్షల మంది ఉ ద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో 6 లక్షలకుపైగా ఉద్యోగాలను రోబోలు భర్తీ చేసే అవకాశం ఉంది. గిడ్డంగుల్లో వస్తువులను ఎంచుకోవడం, ప్యాక్ చేయడం, డెలివరీ చేయడం వంటి పనులను రోబోలు నిర్వహించనున్నాయి. 2018 నుంచి అమెరికాలో అమెజాన్ శ్రామికశక్తి మూడు రెట్లు పెరిగి 12 లక్షలకు చేరింది. అయితే ఆటోమేషన్ కారణంగా కొత్త నియామకాలు నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. 2033 నాటికి అమ్మకాలు రెట్టింపు అవుతాయని అంచనా ఉన్నప్పటికీ, రోబోటిక్ ఆటోమేషన్‌తో కంపెనీ నియామక రేటు స్థిరంగా ఉండగలదని అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌లు బోర్డుకు తెలిపారు. దీంతో 6 లక్షల మంది అదనపు ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
అంతర్గత పత్రాల ప్రకారం, ప్రతి వస్తువుపై 30 సెంట్లు ( రూ.2.5) ఆదా అవుతుందని, 2025-2027 కాలంలో మొత్తం 12.6 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లు) ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అమెజాన్ తన 75 శాతం కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. లూసియానాలోని శ్రేవ్‌పోర్ట్‌లో ఇటీవల ప్రారంభించిన అత్యాధునిక గిడ్డంగి ఇప్పటికే మానవ శ్రామికశక్తిని 25 శాతం తగ్గించింది. 2027 నాటికి ఇలాంటి 40 కేంద్రాలను నిర్మించాలనుకుంటోంది. అయితే అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ చూసిన పత్రాలు అసంపూర్ణమని, కంపెనీ పూర్తి నియామక వ్యూహాన్ని ప్రతిబింబించడం లేదని తెలిపారు. సెలవు సీజన్ కోసం 2.5 లక్షల మందిని తాత్కాలికంగా నియమించనున్నట్లు చెప్పారు. అమెజాన్ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ ఉదిత్ మదన్ మాట్లాడుతూ, ఆటోమేషన్ వల్ల ఆదా అయ్యే డబ్బుతో కొత్త ఉద్యోగాలను సృష్టించడం సంస్థ సుదీర్ఘ విధానమని అన్నారు.