వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాలను తుప్పు పట్టిస్తాయని రాజకీయ పార్టీల అగ్రనాయకులు పదేపదే చెబుతుంటారు. కానీ బీహార్‌లో చాలా ప్రధాన పార్టీలు తమ సీనియర్ నాయకులకు చెందిన రక్తసంబంధీకులకే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి టికెట్ ఇస్తుండడం విశేషం. అధికార నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ)లేదా గ్రాండ్ అలయన్స్ (ఇండియా కూటమి) ఏదైనా ఈ ట్రెండ్‌కు మినహాయింపు కాదు. వంశపారంపర్య రాజకీయాలపై పదేపదే విమర్శలు సంధించే బిజెపి కూడా బీహార్‌లో బంధుప్రీతికి తలొగ్గక తప్పడం లేదు. కొడుకులు, కూతుళ్లు, భార్యలు, కోడళ్లు, అల్లుళ్లు, దగ్గరి బంధువులు ఇలా ఎందరో బరిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా నైతిక ప్రాధాన్యత, సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. బీహార్‌లో గ్రామీణ జనాభా విద్యాస్థాయి చాలా తక్కువగా ఉండడంతో వారసత్వ రాజకీయాల గురించి ఓటర్లు అంతగా పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితి కొనసాగడానికి దోహదమవుతోంది. ఎన్‌డిఎ లోని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి హిందుస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్) సంస్థాపకులుగా రాజకీయ ప్రాచుర్యం మంచి పేరుంది.
ఆయన తన కోడలు దీపాకుమారిని ఇమామ్‌గంజ్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టారు. ఆమె తల్లి జ్యోతిదేవీ బరాచట్టి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, సికంద్రా స్థానంనుంచి జితన్ రామ్‌మాంఝీ అల్లుడు ప్రఫుల్ మాంఝీ బరిలోకి దిగారు. మాజీ ఎంపీ, భూమిహార్ నాయకుడు అరుణ్‌కుమార్ కొడుకు, సోదరుడు, సమీప బంధువులు ఎన్నికల్లో పోటీకి టికెట్లు పొందగలిగారు. అరుణ్‌కుమార్ కొడుకు రితురాజ్ కుమార్ ఘోసి నియోజకవర్గం నుంచి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన సోదరుడు అనిల్ కుమార్ , దగ్గరి బంధువు రోమిత్ కుమార్ క్రమంగా తికారీ, అటారీ స్థానాల నుంచి హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీ టికెట్ పొందారు. బిజెపి తన విధానాలను విడిచిపెట్టి సంస్థాగత రాజకీయ ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇస్తోంది. ఉదాహరణకు టికెట్లు పొందిన వారిలో రాజకీయ అనుభవజ్ఞుడైన, మాజీ ఎంపి శకుని చౌదరి కుమారుడైన బీహార్ డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు. శకుని చౌదరి పూర్వపు సమతా పార్టీ సంస్థాగత సభ్యుల్లో ఒకరు.
సామ్రాట్ చౌదరి 15 ఏళ్ల విరామం తరువాత తారాపూర్ నుంచి పోటీకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కుమారుడు, మాజీ రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా మేనల్లుడు అయిన నితీశ్ మిశ్రాను తిరిగి ఝాంఝర్‌పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి పోటీ చేయిస్తోంది. నితీశ్ కుమార్ కేబినెట్‌లో నితీశ్ మిశ్రా మంత్రిగా ఉన్నారు. అదే విధంగా శ్రేయాసి సింగ్ జమూల్ స్థానంనుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తల్లి పుతుల్ కుమారి బాంకాకు ఎంపిగా ఉన్నారు. గౌరబౌరమ్ స్థానంనుంచి బిజెపి సుజిత్ కుమార్ సింగ్‌కు తిరిగి టికెట్ ఇచ్చింది. ఎమ్‌ఎల్‌ఎ స్వర్ణసింగ్ భర్త సంజీవ్ చౌరాసియా డిఘా నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ గవర్నర్ గంగాప్రసాద్ కుమారుడు సంజీవ్ చౌరాసియా. మాజీ ఎమ్‌ఎల్‌ఎ నవీన్ కిషోర్ ప్రసాద్ కుమారుడు నితిన్ నబీన్ బంకిపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విధంగా మరికొందరు బిజెపిలో పోటీకి దిగుతున్నారు.
మాజీ ఎంఎల్‌ఎ, మాజీ ఎంపి సీతారామ్ సింగ్ కుమారుడు రాణా రణ్‌ధీర్ మధుబన్ నుంచి రంగంలో ఉండగా, మాజీ ఎంఎల్‌ఎ భూపేంద్ర సింగ్ కుమారుడు దేవేష్ కాంత్ సింగ్ గొరియాకోథి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంఎల్‌ఎ సునీల్ పాండే కుమారుడు విశాల్ ప్రశాంత్ తరారీ నుంచి, మాజీ ఎంఎల్‌ఎ రామ్ నరేష్ యాదవ్ కోడలు గాయత్రీ దేవి పరిహార్ నియోజకవర్గంనుంచి పోటీలో ఉన్నారు. అరుణ్‌కుమార్ సింగ్ తండ్రి బ్రిజ్ కిషోర్ సింగ్, తాత యమునా సింగ్ బరూరాజ్ ఎంఎల్‌ఎలుగా పనిచేశారు. జెడి(యు) పార్టీ అభ్యర్థుల జాబితా కూడా దీనికి తీసిపోలేదు. ఎమ్‌ఎల్‌ఎ నీలం దేవీ భర్త అనంత్ సింగ్ మొకమా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపి ఆనంద్‌మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ నబీనగర్ నుంచి, మాజీ మంత్రి మంజువర్మ కుమారుడు అభిషేక్ కుమార్ చెరియా బరియార్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం లోని ఎల్‌జెపి (ఆర్‌వి) లో కూడా బంధుత్వాలు వదల్లేదు.
చిరాగ్ పాశ్వాన్ తన మేనల్లుడు సిమంత్ మృణాల్‌కు టికెట్ ఇచ్చారు. ఆయన బావ జముయి ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)అధినేత, రాజ్యసభ సభ్యులు ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత ససారం నుంచి పోటీ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వంశపారంపర్య రాజకీయాల కేంద్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌జెడిలో అనేక మంది రాజకీయ వారసులు కనిపిస్తారు. మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వియాదవ్, రఘొపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఠా నాయకుడు నుంచి రాజకీయ నాయకుడుగా మారిన దివంగత మొహమ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు ఆర్‌జెడి రఘునాథ్ పూర్ నుంచి టికెట్ ఇచ్చింది. అలాగే ముఠా నాయకుడు, మాజీ ఎమ్‌ఎల్‌ఎ మున్నా శుక్లా కుమార్తె శివానీ శుక్లా లాల్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బ్రిజ్ బిహార్ హత్య కేసులో మున్నాశుక్లా ప్రస్తుతం జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. శివానీ శుక్లా తల్లి మాజీ ఎంఎల్‌ఎ. ఈ విధంగా ఆర్‌జెడి మరికొందరికి టికెట్లు ఇచ్చింది.