లడఖ్ ప్రజలు సెప్టెంబర్ 24ను మరచిపోలేరు. ఆగ్రహోదగ్రులైన జనరేషన్ జెడ్ యువకులు స్థానిక బిజెపి కార్యాలయాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు పోలీసులు జరిపిన కాల్పులలో మాజీ సైనికుడితో పాటు నలుగురు యువకులు ఆనాడు మరణించారు. నమ్మశక్యం కాని విధంగా నిరసనలకు సంబంధించి ఓ గాంధేయవాది, హింసను వ్యతిరేకించే స్థానిక హీరో సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. 1600 కిలోమీటర్ల దూరంలోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు పంపారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర వంటి ఆరోపణలతో ఆ అరెస్టు జరిగింది.
లడఖ్ విభిన్నమైన నేపథ్యంగల రెండు మతాలకు ఆలవాలం. బౌద్ధులతో కూడిన లేహ్, మెజారిటీ షియా ముస్లింలు ఉండే కార్గిల్. ఆ రెండు ప్రాంతాలు రాజకీయంగా, సామాజికంగా భిన్నమైన నేపథ్యం కలవే. కానీ, ప్రజాస్వామ్య ఆకాంక్ష వారిని ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ తమ విభేదాలను పక్కన పెట్టి ఏకంకావడంతో లడఖ్ రాజకీయాలలో కొత్త చైతన్యం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) నేత సజ్జాద్ హుస్సేన్ కార్గిలి తో హరీందర్ జరిపిన ఇంటర్వ్యూ.
ప్రశ్న: గతంలో లడఖ్ స్వతంత్ర ప్రతిపత్తి గల హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు 2023లో ఎన్నికలు జరిగాయి. లేహ్ అపెక్స్ సంస్థ వాటిని బాయ్‌కాట్ చేసింది, కెడిఎ పాల్గొన్నది. త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండుసంస్థలు కలిసి పనిచేస్తాయా?
జవాబు: ఈ ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే జరగవలసి ఉంది. వాయిదా పడ్డాయి. ఇప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఈ మధ్య జరిగిన హింసాకాండతో ఎన్నికలు మరింత జాప్యం కావచ్చు. బిజెపి మౌనంగా ఉంది. బిజెపి కేవలం ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీయే కాదు. కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం యంత్రాంగం దానికి అనుకూలంగా ఉందని ప్రజలకు తెలుసు. కెడిఎకు సంబంధించినంతవరకూ ఎన్నికలు కేవలం రాజకీయ వ్యవహారం కాదు. అది జనవాక్య సేకరణ (రిఫరేండమ్). ఈ ప్రాంతంలో ప్రజలు తన ఆకాంక్షలను ఎలా తోసిపుచ్చారో తమ ఓట్ల ద్వారా చెబుతారు. ఈ సందేశం కౌన్సిల్ ఎన్నికలకే పరిమితంకాదు. పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించవచ్చు.
ప్రశ్న: గతంలో కార్గిల్, లేహ్ ఆలోచనలు భిన్నంగా ఉండేవి కదా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత, లేహ్ ఆ చర్యను స్వాగతించగా, కార్గిల్ వ్యతిరేకించింది. ఏ మార్పు మీ ఇద్దరినీ ఎలా ఏకం చేసింది?
జవాబు: తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోరని ప్రజలు గుర్తించినప్పుడు వారు షాక్ తిన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో దాని వల్ల గ్యారంటీగా కలిగే రక్షణలు దూరమయ్యాయి. అభద్రతా భావం రెండు వర్గాలను ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ ప్రజాస్వామ్య పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత వహిస్తోంది. కార్గిల్‌లో డెమోక్రాటిక్ అలయన్స్ చురుగ్గా పని చేస్తోంది. సరైన ప్రాతినిధ్యం లేకపోవడమే సమస్యకు కారణమని ప్రజలు గుర్తించారు. నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం కొరవడడం వల్ల సమన్వయ కృషి వల్లనే తమ వాదన వినిపించగలమని తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యపరమైన మార్పుకోసం అందరూ ఏకం కావడం అవసరం.
ప్రశ్న: లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంపై గతంలో లేహ్, కార్గిల్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయంలో విభేదాలు తొలగాయా?
జవాబు: గతంలో మతపరమైన విభేదాలు ఉద్దేశపూర్వకమైన సామాజిక పరిస్థితులవల్ల ఏర్పడినవి. గతంలో ప్రభుత్వాలు ఈ విభేదాలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాయి. హింస ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో లేహ్ లోని బౌద్ధ మతస్థులు పార్లమెంటులో కనీసం ఒక బౌద్ధుడు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. సమంజసమైన కోర్కే. అలాగే కార్గిల్ నుంచి షియా ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లభించాలని కోరుకున్నారు. దేశంలో నిజమైన షియా ప్రతినిధి లేరు కూడా. అందువల్ల షియా ప్రతినిధి లడఖ్ నుంచి పార్లమెంటుకు వెళ్లాలని కోరుకుంటున్నది. లడఖ్‌కు రెండు పార్లమెంటు సీట్లు, ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తే, రెండు కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లభిస్తుంది.
ప్రశ్న: బిజెపి లేదా ప్రభుత్వం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? లడఖ్‌కు సంబంధించి వారి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు: వారి చివరి ఎత్తు ఏమిటన్నది ఆందోళన కలిగించడం లేదు. మా న్యాయపరమైన హక్కుల కోసం మేం పోరాటం సాగించేందుకు దృఢచిత్తంతో ఉన్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలను మాపై రుద్దేయలేదు. లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలన్నదే మా నిశ్చితాభిప్రాయం. ఆ డిమాండ్ నెరవేరే వరకూ మేం విశ్రమించం.
ప్రశ్న: గతంలో కార్గిల్‌లో బిజెపి పెద్దగా లేదు. అయినా కౌన్సిల్ ఎన్నికల్లో కాస్త మెరుగ్గా ఓ సీటు గెలుచుకుంది ఎలా?
జవాబు: కార్గిల్‌లో బిజెపి ప్రభావం నిజానికి పరిమితమే. బౌద్ధుల జనాభా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వారు సులభంగా మద్దతు పొందుతున్నారు. మొత్తం మీద చూస్తే, లేహ్‌లో వారి బలం గణనీయమైనదే.
ప్రశ్న: సోనం వాంగ్ చుక్‌ను విడుదల చేయాలని జరిగిన హింసాత్మక ఘటనలపై జుడీషియల్ విచారణ చేయాలని మీరు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందస్తు డిమాండ్లు ఇవేనా. ఇదికాక మీ డిమాండ్ ఏమైనా ఉందా?
జవాబు: మా ప్రధాన డిమాండ్ ఒకటే లడఖ్‌కు తమ డిమాండ్ చెప్పే అవకాశం ఇవ్వండి. కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజల గొంతు మూగపోయింది. ఇక్కడి ప్రజలకు రాజకీయ డిమాండ్లు ఏమీ లేవు. అంతా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. కంటి తుడుపు ప్రజాస్వామ్యం కాదు. పూర్తిస్థాయి నిజమైన ప్రజాస్వామ్యం. లడఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పించాలన్నదే మా డిమాండ్. మాకు రాజ్యాంగపరమైన అన్ని హక్కులు కల్పించండి. అదనంగా ఆరో షెడ్యూల్‌లో మమ్మల్ని చేర్చమని కోరుతున్నాం.
ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పిస్తే!
జవాబు: వారు అదే చేయవచ్చు. కానీ, దానివల్ల మా పోరాటం ముగిసిపోదు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం అయినా, పూర్తి అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉంటాయి. ప్రజలకు నిర్ణయాధికారం ఉండదు. లడఖ్ మరో ఢిల్లీ కావాలని మేం కోరుకోవడం లేదు. రాజ్యాంగ పరిరక్షణలతో కూడిన ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా నడిచే స్వయం పాలిత రాష్టం హోదా కల్పించాలి. పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తే తప్ప అది నెరవేరదు.