వచ్చే పదేళ్లదాకా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోను అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొనడం ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏటా దసరా, శ్రీరామనవమి, మహాశివరాత్రి వేడుకలను జగ్గారెడ్డి వైభవంగా నిర్వహిస్తారు. సంగారెడ్డిలోనే భారీ ఏర్పాట్ల నడుమ అట్టహాసంగా జరిపే ఈ వేడుకలకు వేలాది మంది హాజరవుతారు. అయితే, దసరా, శివరాత్రి వేడుకలకు సభా వేదిక కూడా ఉంటున్నందున ఈరెండు సందర్భాల్లో ఆయన ప్రసంగిస్తారు. ఈసారి కూడా అలాగే దసరా వేడుకల్లో వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. నాటి టిఆర్‌ఎస్‌పై ప్రతి సందర్భంలోనూ ఒంటికాలిపై లేచారు. బిఆర్‌ఎస్ నేతలే కాదు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఆయనకు దూరంగా ఉండేవారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఫైర్ బ్రాండ్ పేరును కొనసాగించింది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఆయనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా తెచ్చిపెట్టింది. అందుకని ఆయన ఎక్కడికి వెళ్లినా.. హంగామా ఉంటుంది. మాజీ సిఎం కెసిఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, నేటి మంత్రి రాజనర్సింహ, దివంగత బాగారెడ్డి లాంటి నేతలు ఉమ్మడి మెదక్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ జగ్గారెడ్డిది ప్రత్యేక శైలి! సహజంగా రాజకీయ నేతలు ఖద్దరు చొక్కాలు ధరిస్తారు. లేకుంటే, వివిధ రంగుల్లో చొక్కాలు ధరిస్తారు. కానీ, ఎల్లప్పుడూ టీషర్టు ధరించడం ద్వారా ‘మాస్’ ముద్ర వేసుకున్నారు.
తొలుత బిజెపి ద్వారా సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేసి, ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా సంగారెడ్డి నుంచి గెలుపొందారు. కేంద్ర మాజీ మంత్రి టైగర్ నరేంద్ర ప్రియశిష్యునిగా ఆయన వాగ్ధాటిని పుణికిపుచ్చుకున్నారు. అదే జోష్‌ను గత రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో కాంగ్రెస్ సభను ఆయన నిర్వహించారు. కోట్లాది రూపాయల ఖర్చుతో సంగారెడ్డిలో జరిపిన ఈ సభ ద్వారా ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిలో ఆయనపడ్డారు. ఆ విధంగా ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 లో మూడోసారి ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విధంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023 ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ కోటాలో మంత్రి పదవి ఖాయమనుకున్న సమయంలో.. ఓటమి పాలయ్యారు. ఆ విధంగా ఆయన దూకుడుకు బ్రేకు పడింది. అయినప్పటికీ అటు రాహుల్ గాంధీ వద్ద ఉన్న పలుకుబడితో, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీ అవసరాల రీత్యా ఆయన భార్య నిర్మల కు టిజిఐఐసి ఛైర్మన్‌గా నామినేటెడ్ పోస్టు లభించింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పదవి ద్వారా జగ్గారెడ్డికి పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు మరోసారి వెల్లడయింది.
ఈ నేపథ్యంలో తరచుగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల దసరా ఉత్సవాల్లో చేసిన వ్యాఖ్యలు అటు సొంత పార్టీలో, ఇటు విపక్షాల్లో కూడా చర్చకు దారితీశాయి. మరో మూడేళ్ల తర్వాత, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. తనకిప్పుడు 59 సంవత్సరాలు అని, పదేళ్ల తర్వాత అంటే 69 సంవత్సరాల వయస్సులో తిరిగి పోటీ చేస్తానని, మధ్యలో తన కోసం సేవ చేసిన తన అనుచరుడు ఆంజనేయులు వస్తే రావచ్చని ఆయనన్నారు. అప్పటి వరకు తాను వీరికి వెంట ఉండి నడిపిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వల్లనే జగ్గారెడ్డి ఇలా అంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ క్రియేట్ చేసేందుకు ఇలా అన్నారని మరికొందరు అంటున్నారు. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నదని ఇంకొందరు అంటున్నారు. మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఏమో? ఇంత ముందుగా ప్రకటనలు అవసరమా? అని విపక్షాలు అంటున్నాయి. మూడేళ్ల తర్వాత అయినా… ఇంకా ఎప్పుడైనా… పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందే కదా…! అలాంటప్పుడు ఈ వ్యాఖ్యల ప్రభావం ఏమీ ఉండదని స్వపక్షంలోని కొందరు భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత రాజెవడో… రాకాసి ఎవడో..!? అని అంటున్నారు. ఆయన అనుచరులు మాత్రం కొంత గందరగోళానికి గురవుతున్నారు.
గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ ఈ దఫా చేసిన ప్రకటన తన రాజకీయాలకు సంబంధించినది కావడం ప్రత్యేకత సంతరించుకున్నది. మొత్తమ్మీద తన ప్రకటనలు, వ్యాఖ్యానాల ద్వారా నిత్యం జనంలో చర్చలో ఉండడం ద్వారా జగ్గారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయనకు కొన్ని సార్లు నష్టం కలిగించగా, మరికొన్ని సార్లు బలాన్ని పెంచాయి. ఉమ్మడి ఎపి మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి లాంటి ఉద్దండులు ఏలిన సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం పార్టీలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని జగ్గారెడ్డి కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సిఎంలు వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తోపాటు నేటి రేవంత్‌రెడ్డితో తాను సన్నిహితంగా ఉన్నానని బహిరంగంగానే అంటుంటారు. గెలుపోటములకు సంబంధం లేకుండా తనకంటూ ఒక వర్గాన్ని ఆయన సృష్టించుకున్నారు. నాకు తోచిందే నేను చేస్తాను… ఇంకొకరు చెప్పింది చేయనే చేయను… అని చెప్పడం కూడా ఆయనకే చెల్లింది! అందుకని బిఆర్‌ఎస్ ఆయనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఈసారి ఏమవుతుందో చూడాలి!.
బండారు యాదగిరి
98489 97083
(ఉమ్మడి మెదక్ బ్యూరో)