అడిలైడ్: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే రెండో వన్డే టీమిండియాకు సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇక తొలి వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మొదటి వన్డేలో పలుమార్లు వర్షం అడ్డంకిగా మారడంతో భారత బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతిన్నది. దీని ప్రభావం జట్టు బ్యాటింగ్‌పై బాగానే పడింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ఆస్ట్రేలియా బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.
హాజిల్‌వుడ్, మిఛెల్ ఓవెన్, కుహ్నెమన్ తదితరులు అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటర్లను హడలెత్తించారు. తొలి వన్డేలో కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ తదితరులు నిరాశ పరిచారు. కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ విఫలం కావడంతో భారత్ ప్రత్యర్థి టీమ్ ఆస్ట్రేలియా ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేక పోయింది. ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి, రోహిత్, అయ్యర్, గిల్ తదితరులు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే టీమిండియా గెలుపు అవకాశాలు మెరుగు పడుతాయి.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. స్టార్క్, హాజిల్‌వుడ్, ఎల్లిస్, ఓవెన్, కుహ్నెమన్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కెప్టెన్ మార్ష్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్, రెన్‌షా, ఓవెన్ తదతరులతో బ్యాటింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.