పాట్నా: బీహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారం లోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ. 30 వేలు వంతున నెలవారీ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. వారిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు రూ. 5 లక్షలు వరకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఈమేరకు విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఎన్నికలకు ముందు ఎన్డీయే సర్కారు మహిళల ఖాతాలో రూ.10 వేలు వేయడాన్ని లంచంగా తేజస్వియాదవ్ అభివర్ణించారు.
ఇది సాయం కాదని, రుణం అని అమిత్‌షా కూడా పేర్కొన్నట్టు గుర్తు చేశారు. కాబట్టి భవిష్యత్‌లో ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారని అన్నారు. ఈ క్రమం లోనే మహిళా ఓటర్లను , మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉండే జీవికా దీదీలను ఆకట్టుకునేందుకు ఈ హామీ ప్రకటించారు. బీహార్ ప్రభుత్వం 2007లో జీవిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సమూహాలు ఏర్పాటు చేయడం , వారికి రుణాలు , శిక్షణ , ఉద్యోగ అవకాశాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక , సామాజిక, అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడింది. బీహార్‌లో సుమారు 10 లక్షల మంది వరకు జీవికా దీదీలు ఉన్నారు.