మైక్రోసాఫ్ట్ సిఇఒసత్య నాదెళ్ల 2024-25 ఆర్థిక సంవత్సరానికి 96.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.847 కోట్లు) జీతం అందుకున్నారు. ఇది ఇప్పటివరకు ఆయనకు లభించిన అత్యధిక వేతనం కాగా, గత సంవత్సరం 79.1 మిలియన్ డాలర్లు (రూ.694 కోట్లు) వేతనం కంటే 22% ఎక్కువగా ఉంది. కంపెనీ బోర్డు ప్రకారం, నాదెళ్ల వేతనం పెరుగుదలకు కారణం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ (ఎఐ) రంగంలో సాధించిన విశేష పురోగతి, అయితే నాదెళ్ల జీతం ప్యాకేజీలో 2.5 మిలియన్ డాలర్లు (రూ.22 కోట్లు) మూల వేతనం కాగా, మిగిలిన 90% షేర్ల రూపంలో ఉంది. ఆయనతో పాటు సిఎఫ్‌ఒ అమీ హుడ్‌కి రూ.259 కోట్లు, కమర్షియల్ హెడ్ జడ్సన్ ఆల్థాఫ్‌కి రూ.247 కోట్లు వేతనాలు లభించాయి.
నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎఐ రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించింది. అజూర్ క్లౌడ్ వ్యాపారం అమెజాన్‌తో పోటీపడుతూ వేగంగా ఎదుగుతోంది. ఈ సంవత్సరం మైక్రోసాఫ్ట్ షేర్లు 23% పెరిగాయి. గిట్‌హబ్, లింక్డ్‌ఇన్, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కొనుగోళ్లతో కంపెనీ వ్యాపారాన్ని విస్తరించారు. నాదెళ్ల 2019లో ఓపెన్ ఎఐలో పెట్టుబడి పెట్టి, చాట్ జిపిటి విజయంతో ఎఐ రంగంలో మైక్రోసాఫ్ట్ స్థానాన్ని బలపరిచారు. హైదరాబాద్‌లో జన్మించిన ఆయన మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్, అమెరికా విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ పూర్తి చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి, 2014లో కంపెనీ మూడో సిఇఒగా బాధ్యతలు చేపట్టారు.