మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటీ స్టీల్ సమీపంలో గోరక్షక సభ్యుడిపై కాల్పుల సంఘటన బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరక్షక సభ్యుడు ప్రశాంత్ సింగ్ సోను పశువుల తరలింపుపై బిజెపి నాయకులకు సమాచారం ఇస్తున్నాడంటూ బహదూర్‌పూర్‌కు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి యంనంపేట్ కిటీ స్టీల్ సమీపంలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయం వెనుక వెంచర్‌లోకి చర్చల నిమిత్తం తీసుకువెళ్లాడు. అనంతరం ప్రశాంత్ సింగ్ సోనుపై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో సోను రోడ్డు మీదకు వచ్చి పడిపోగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సిఐ రాజు ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.