లండన్ : ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు చేదు వార్త. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీలు ఏటా తమ ట్యూషన్ ఫీజులను పెంచనున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు ఉంటుందని యూకె ప్రభుత్వం వెల్లడించింది. విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూకే విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ తెలిపారు. ఈమేరకు అక్కడి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ బ్రిడ్జెట్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పూర్తి స్థాయి ఫీజుల వసూలుపై కొన్ని షరతులు వర్తిస్తాయని ఆమె తెలిపారు. నాణ్యమైన బోధనా వ్యవస్థ , విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే యూనివర్శిటీలు గరిష్ఠ ఫీజులు వసూలు చేయొచ్చని పేర్కొన్నారు.
తాజా నిర్ణయంతో యూనివర్శిటీల్లో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని , నైపుణ్యాలు తమ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఎనిమిదేళ్ల తరువాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ యూనివర్శిటీలు తమ ట్యూషన్ ఫీజులను పెంచాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ ఫీజు 9535 పౌండ్లుగా ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా వచ్చే ఏడాది ఫీజు పెంపు ఉంటుంది. అది ఎంతనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం.
2026 లోనూ ద్రవ్యోల్బణం ఇప్పటిలాగే ఉంటే గనుక, ఫీజులు దాదాపు 400 పౌండ్లు పెరిగి 9900 పౌండ్లు దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఇంగ్లాండ్ లోని విశ్వవిద్యాలయాలు ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. ఖర్చు నియంత్రణలో భాగంగా గతేడాది ఈ యూనివర్శిటీల్లో దాదాపు 12 వేల వరకు ఉద్యోగాల్లో కోతలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయం తమకు ఎంతో ఊరటనిస్తుందని యూనివర్శిటీ యూకే యూనియన్ వెల్లడించింది.