బ్రసెల్స్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించే విషయంపై బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన్ను భారత్‌కు అప్పగించడంలో తమకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు ఇటీవల బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన అప్పగింత ఆమోదం రాజకీయంగా ప్రేరేపించిందని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా బెల్జియం యాంట్వైర్ప్ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు కాదని, గుర్తు చేసింది. అప్పగింతను సమర్థించే తీవ్రమైన అభియోగాలు అతడు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది.
ఛోక్సీపై భారత్ వేసిన అభియోగాలను బెల్జియం చట్టప్రకారం కూడా నేరాలుగానే పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. భారత్ ఆదేశాల మేరకు తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ చాలా కాలంగా ఛోక్సీ చేస్తున్న వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా ఛోక్సీ అప్పగింత అనంతరం అతడిని ఉంచే జైలుకు సంబంధించి భారత ప్రభుత్వం అందించిన వివరాలను బెల్జియం కోర్టు ప్రస్తావించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ (కేసులో మరో ప్రధాన నిందితుడు ) దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వాబార్బుడాకు వెళ్లగా, నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. ఇటీవల ఆంట్రర్ప్ లోని న్యాయస్థానం ఛోక్సీ అప్పగింతకు ఆమోదం తెలిపింది.