హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకొని యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణాశాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులను రద్దు చేస్తూ జూలై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజులు ఆలస్యంగా జివొ జారీ అయింది. ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా.. చెక్‌పోస్టులను ఇంకా తెలగించకపోవడం గమనార్హం.
జిఎస్టి అమలులోకి వచ్చాక చెక్‌పోస్ట్‌ల అవసరం దాదాపు తగ్గిపోయింది. కేంద్ర సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్‌పోస్టులను రద్దు చేశాయి. కానీ, తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి. ఏడాదిన్నర క్రితమే రాష్ట్రంలో చెక్‌పోస్టుల రద్దుకు రవాణాశాఖ నిర్ణయం తీసుకున్నా.. కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల క్రితం జివొ జారీ అయింది. అయినా అవినీతి అధికారుల తీరు మారలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టులు రద్దు చేయాలని రవాణాశాఖ కమీషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.