ఐపిఎల్‌లో అత్యంత చిన్న వయస్సులోనే ఎంపికై.. తక్కువ బంతుల్లో(35) సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వైభవ్ ఐపిఎల్ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో వైభవ్ మరోసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు సమాచారం. తమ అండర్-19 జట్టు భారత్‌లో పర్యటించే అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. భారత అండర్-19 స్థాయిలోని ఎ, బి జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ సూర్యవంశీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక అఫ్గన్- భారత అండర్-19 జట్ల మధ్య ఈ ట్రై సిరీస్ డబుల్ రౌండ్- రాబిన్ ఫార్మాట్లో జరుగనుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. మెరుగ్గా ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి.