ప్రతి ఏటా దీపావళిని చెడు అనే చీకటిపై సాధించిన వెలుగుల విజయంగా భావించి దేశంలో పండగ జరుపుకోవడం సంప్రదాయ ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బాణాసంచా కాల్పులు, టపాసుల మోతలు పండగ సంకేతాలుగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. క్లైమేట్ ట్రెండ్స్ తాజా అధ్యయనం ప్రకారం గత ఐదేళ్లలో లేని విధంగా ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయిందని తేలింది. నిషేధాజ్ఞలు ఎన్ని ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బాణాసంచా లేదా టపాసుల నిషేధాన్ని సంప్రదాయాన్ని ఉల్లంఘించడంగానే భావిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. అసలే వాహన కాలుష్యంతో, పంటదగ్ధాలతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, దీపావళి వచ్చే సరికి అవన్నీ మరిచిపోతుంటారు. 2018 లో కూడా ఢిల్లీలో టపాసుల అమ్మకాలు, వినియోగంపై సుప్రీం కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసినా, ఆచరణ శూన్యమైంది.
2024 నుంచి బాణాసంచా అక్రమ అమ్మకాలను నిషేధించారు. కానీ అవి పని చేయడం లేదు. సరిహద్దు లోని పట్టణాల్లో బాణాసంచా, టపాసుల అక్రమాలు విచ్చలవిడిగానే సాగుతున్నాయి. దీపావళి తరువాత ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఎక్యుఐ) బాణాసంచా కాల్పులతో ప్రమాదకరమైన జోన్‌గా తయారైంది. ఎక్యుఐ 050 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్టు, 447 కు పాయింట్లు పెరిగితే తీవ్ర వాయు కాలుష్యంగా మారినట్టు కాలుష్య సూచికల సారాంశం అందరికీ తెలిసిందే. దీని ప్రకారం దీపావళి పండగ రాత్రి నుంచి మంగళవారం నాటికి వాయు నాణ్యత స్థాయిలు 400 పాయింట్లు మించి క్షీణించాయి. 38 ఎయిర్ మోనిటరింగ్ స్టేషన్లలో 36 రెడ్‌జోన్లలోనే ఉండటం విశేషం. వజిర్‌పూర 423, ద్వారకా 417, అశోక్‌విహార్ 404, ఆనంద్‌విహార్ లో 404 గా ఎక్యుఐ నమోదైంది. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 235 ఎక్యుఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సోమవారం సాయంత్రం అంటే దీపావళి రోజున సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఎక్యూఐ 345గా ‘వెరీపూర్’ కేటగిరిలో నమోదైంది. బాణాసంచా కాల్పులవల్లనే రాత్రికి రాత్రి వాయు నాణ్యత అధ్వానంగా తయారైంది.
దీపావళికి వారం రోజుల ముందునుంచే ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలకు చేరుకున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 300 పాయింట్ల క్షీణతను సూచించింది. నోయిడా, ఘజియాబాద్‌ల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీలో విషవాయువులు గాఢత 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, కంటి దురదలతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలుగా దీపావళి రోజున బాణాసంచా కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది అనేక ఆంక్షలు విధించినా, ప్రజాప్రతినిధుల నుంచి వివిధ వర్గాల నుంచి గ్రీన్ కాకర్స్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ కోర్టు ఆదేశాలు పండగ సంప్రదాయం ముందు నిలువలేదు. అర్ధరాత్రి దాటినా బాణాసంచాలు కాలుస్తున్నారు. టపాసులు పేలుస్తున్నారు. బాణాసంచాలు, టపాసుల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై చాలా మందికి అవగాహన ఉండడం లేదు. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం తదితర వ్యాధులు సంక్రమిస్తుంటాయని ప్రజల్లో చాలా మందికి తెలియడం లేదు.
కేవలం వాయు కాలుష్యం వల్లనే 2019 లో దాదాపు 1.67 మిలియన్ మంది అకాల మరణాలకు బలయ్యారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బాణాసంచా, టపాసుల తయారీపై లక్షలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. తమిళనాడులో శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలు ఎన్నో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిషేధం వల్ల తమకు ఉపాధి పోతుందన్న ఆందోళన వారిలో ఉంటోంది. అలాగే గ్రీన్‌కాకర్స్ ప్రయోజనం గురించి కూడా ప్రజలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. హానికరమైన రసాయనాలు వినియోగించకుండా, తయారు చేసే బాణాసంచాలనే గ్రీన్ కాకర్స్‌గా వ్యవహరిస్తారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో గ్రీన్ కాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వమే సబ్సిడీపై గ్రీన్ కాకర్స్‌ను ప్రజలకు పంపిణీ చేస్తే చాలావరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్న సూచనలు వస్తున్నాయి. వాయు నాణ్యతను పెంపొందించడానికి గత దశాబ్దకాలంగా చర్చలు జరుగుతున్నాయి.
ఢిల్లీ వంటి నగరాలు, రాష్ట్రాలు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపి) సిద్ధం చేసి అమలు లోకి తీసుకొచ్చాయి. అయితే సవాళ్లకు స్పందించి చర్యలు తీసుకోవడం జాప్యం అవుతోంది. ఇప్పుడు చేయవలసిందంతా మధ్యతరహా నుంచి స్వల్పకాలిక ప్రణాళికలతో ఏడాది పొడుగునా, గాలి స్వచ్ఛంగా ఉండేలా చర్యలు కొనసాగించడం తప్పనిసరి. ఈ మేరకు నిధులు సమృద్ధిగా కేటాయించడం అవసరం. ఇందులో పౌరులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. పాలకవర్గాల జవాబుదారీతనం పెరగాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) ప్రస్తుతం వాయు నాణ్యత పిఎం (పర్టిక్యులర్ మేటర్)ను 2.5 కంటే తగ్గించాలని లక్షంగా పెట్టుకుంది. ఈ లక్షంలో కనీసం 20 నుంచి 40 శాతం వరకైనా 2026 నాటికి సాధించవలసి ఉంది. ఈ మేరకు లక్షాలను సాధించలేకుంటే ఢిల్లీతోపాటు ఎన్‌సిఆర్ తదితర పరిసర ప్రాంతాల్లోనూ ఎవరూ నివసించలేని దుర్భర పరిస్థితి దాపురిస్తుంది.