ఇక్కడ కాదు లెండి, అమెరికాలో. అమెరికా రక్షణ కార్యాలయ కేంద్రం పెంటగాన్‌లో ఇది సంభవించింది. స్వేచ్ఛకు ప్రతీకగా పేరొందిన అమెరికాలో ఇలాంటి బహిష్కరణలు జరగడంలో వింత ఏమీ లేదు. జర్నలిజం వృత్తి ఆ నేలపై అత్యంత గొప్ప వృత్తిగా పేరొందింది. జర్నలిజం అంతా వ్యాపారంగా మారిపోయిన తరువాత కూడా ప్రపంచంపై అమెరికా పెత్తనానికి గుండెకాయ లాంటి పెంటగాన్ విలేకరుల సమావేశం బహిష్కరించడం సాధారణ పరిణామం కాదు. ఈ కారణంగా బహిష్కరణ అనేది అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన పరిణామం అనే చెప్పాలి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అమెరికాలో జర్నలిజం స్వతంత్రంగానే కొనసాగుతున్నది. కార్పొరేట్ యాజమాన్యాల గుప్పిట్లో మీడియా చిక్కుకొని సంపూర్ణ వ్యాపారంగా మారిపోయినా అమెరికాలో జర్నలిస్టులు తమ వృత్తి పట్ల ఇంకా నిబద్ధతతోనే పని చేయగలుగుతున్నారని ఈ పరిణామం చెబుతున్నది. అయితే ఇదేమీ సాధారణ బహిష్కరణ కాదు.ఒక పత్రికా సమావేశానికి మాత్రమే పరిమితమైనది కూడా కాదు.
అమెరికా రక్షణశాఖ పెంటగాన్ కార్యాలయంనుంచి నిత్యం పనిచేసే జర్నలిస్టులపై విధించిన ఆంక్షల ఫలితం ఇది. తాము చెప్పిన విషయాలను మాత్రమే రాయాలని, ఇతర విషయాలను రాయడానికి, ప్రసారం చేయడానికి ఎంతమాత్రం వీలు లేదని ప్రకటించింది అమెరికా రక్షణశాఖ పెంటగాన్. జర్నలిస్టులు స్వతంత్రించి పెంటగాన్ కార్యాలయంలో ఏ అధికారినైనా కలవడానికి వీలు లేదని, అందుకు గాను తమ అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ ట్రంప్ నేతృత్వంలోని రక్షణశాఖ జర్నలిస్టులపై చాంతాడంత పొడవైన పెద్ద ఆంక్షల జాబితానే ప్రకటించింది. అంతేకాదు, తాము విధించిన ఆంక్షలను అంగీకరిస్తూ ఒక పత్రం (అఫిడవిట్) పై జర్నలిస్టులు అందరూ సంతకాలుచేసి తీరాలని పెంటగాన్ కార్యాలయం బీట్ జర్నలిస్టులను ఆదేశించింది. పెంటగాన్ జర్నలిస్టులు దీనిని వ్యతిరేకించారు. అభ్యంతరం తెలిపారు. పెంటగాన్ యంత్రాంగం దీనినేమీ పట్టించుకోలేదు. సంతకాలుచేసిన తరువాతనే విలేకరుల సమావేశానికి అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో ఆ బీట్ జర్నలిస్టులు అందరూ మూకుమ్మడిగా అమెరికా రక్షణ మంత్రి సమావేశాన్ని బహిష్కరించారు. పెంటగాన్ కార్యాలయంలో వార్తల కవరేజీకోసం తమకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులను జర్నలిస్టులు అందరూ మూకుమ్మడిగా ఆ యంత్రాంగానికి అప్పగించి వేశారు.
వార్తల కవరేజి కోసం అక్కడ తాము స్థిరంగా ఏర్పాటు చేసుకున్న కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తు పరికరాలు అన్నిటిని సమావేశ బహిష్కరణ సందర్భంగా కార్యాలయం నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఇకపై తాము పెంటగాన్‌కు రాబోవడం లేదని సంకేతాత్మకంగా, స్పష్టంగా నిరసన తెలిపారు అమెరికా జర్నలిస్టులు. కానీ పెంటగాన్ సమాచారాన్ని వార్తలు నివేదించే తమ వృత్తిగత కర్తవ్యాన్ని నిలిపివేయబోమని, దానికి అవసరమైన సమాచారాన్ని తాము స్వతంత్రంగా తమ స్వంత పద్ధతుల్లో సేకరిస్తామని వాళ్లు ప్రకటించారు. గత మంగళవారం నాడు ఈ పరిణామం సంభవించింది. సుమారు 250 యేళ్లక్రితం అమెరికా బ్రిటిష్ పరిపాలననుంచి స్వతంత్ర దేశం గా అవతరించింది. నాటి నుంచి నేటి వరకు అమెరికా సమాజానికి వార్తలు సమాచారాన్ని అందించడంలో ఏనాడూ రాజీపడలేదు. సర్కారుకు లొంగి పోలేదు. అమెరికా సమాజ ప్రయోజనాల పరిరక్షణకు విశేష స్థాయిలో కృషిచేసింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు యూరప్‌లోని చాలా దేశాల్లో కూడా ఇండియాతో పోల్చితే జర్నలిజం స్వతంత్రంగానే పని చేస్తున్నది. అలాంటిది ఇండియాలో సంభవించి ఉంటే నిజంగా చాలా పెద్ద ఆశ్చర్యమే.
కానీ ఈ నేలపై అలాంటివి సంభవించే అవకాశాలు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇండియా కూడా 75 యేళ్లక్రితం బ్రిటిష్ వలసపాలన నుంచే స్వాతంత్య్రం పొందింది. వలస పాలనలో భారత జాతి ప్రయోజనాల కోసం భారతీయ జర్నలిజం పోషించిన పాత్ర అత్యంత ఘనమైనదే. వృత్తి నిబద్ధతలో అమెరికా, ఇండియా జర్నలిస్టుల శీలం శంకించేదేమీ కాదు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించేవరకు చాలా భారతీయ పత్రికలు, జర్నలిస్టులు చాలా వరకు స్వతంత్రంగానే పని చేశాయని చెప్పాలి. ఇందిర నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి జాతిని జాగృతంచేశాయి. పత్రికా స్వతంత్ర రక్షణకోసం నాడు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు పోషించిన పాత్ర జర్నలిజం చరిత్రలో గర్వించదగినది. అలా పత్రికలు, జర్నలిస్టులు తమ వృత్తి నిబద్ధతను గట్టిగా చాటుకొని అసలైన పత్రికా స్వేచ్ఛను నాడు నిలబెట్టుకున్నాయి. కానీ నేడు ఆ స్థితి లేదు. స్వతంత్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వరకు ఒక లెక్క. ఎమర్జెన్సీ తదనంతరం జర్నలిజంలో భారతీయ జర్నలిజంలో వ్యాపార పోకడలు ప్రవేశించాయి. అయినా కూడా జర్నలిస్టులు స్వతంత్రంగానే వ్యవహరించి పౌరుల భావస్వేచ్ఛను కాపాడే కృషిని విశేష స్థాయిలో నిర్వహించారు. నాటివరకు వాస్తవాలను సమాజానికి అందిస్తూ సాగిన కలం సాగు జర్నలిజం పూర్తిగా వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడం మొదలైంది.
90లలో దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలవడంతో దేశంలోని మీడియాలోకి అంతర్జాతీయ వ్యాపారుల పెట్టుబడుల ప్రవేశం పెరిగిపోయింది. మీడియాలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో మొత్తం భారతీయ జర్నలిజం తీరుతెన్ను సంపూర్ణంగా వ్యతిరేక దిశ మళ్లింది. క్రమంగా పత్రికలు, టెలివిజన్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల వాటా పెరిగిపోయింది. దీంతో పత్రికల ఎడిటోరియల్ విధానం పూర్తిగా భిన్నరూపం సంతరించుకుంది. దీంతో యథాతథంగా వార్తలు, సమాచారం అందించడంలో మీడియా ఎడిటోరియల్ విధానం జోక్యం పెరిగింది.ఫలితంగా జర్నలిస్టు కలం స్వేచ్ఛకు పరిమితులు, ఆంక్షలు మొదలయ్యాయి. విదేశీ పెట్టుబడులు ప్రవేశించకముందు అనేకమంది జర్నలిస్టులే పత్రికలను సామాజిక సేవ లక్ష్యంతో నిర్వహించేవారు. భారతీయ కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడుల ప్రవేశంతో పత్రికలను జర్నలిస్టులు నడిపించగల పరిస్థితులు దాదాపుగా అంతరించిపోయాయి. అలాంటి ఒకటీ, అర పత్రికలు అక్కడక్కడా ఉన్నప్పటికీ జర్నలిజం వ్యాపారుల ఆర్థిక శక్తియుక్తుల ముందు అవి మనుగడ సాగించగల స్థితి లేదిప్పుడు. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం అది సామాన్యులకు కూడా చవకగా లభిస్తూ ఉండడంతో మాస్, సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా వ్యాపించింది. ప్రపంచంలోని ఏ మూలన జరిగిన పరిణామమైనా క్షణాల్లో అందరికీ తెలిసే వెసులుబాటు కలిగింది. దీంతో సోషల్ విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా సమాచారంకోసం మీడియాపై ఆధారపడడం తగ్గిపోయింది. ఫలితంగా మీడియా ప్రభావం, ప్రాధాన్యత సమాజంపై కొంత తగ్గింది. పదేళ్లుగా దేశంలో మీడియా స్వేచ్ఛ బలహీనపడడం మొదలైంది.
జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అనేక రకాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఫలితంగా భారతీయ జర్నలిజం విశ్వసనీయత క్షీణ దశ మొదలైంది. ఈ క్రమంలో పత్రికాస్వేచ్చ, పౌరుల భావస్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయాయి. ఈ ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే భావస్వేచ్ఛ అనేది ఈ నేలపై ఒక చరిత్రగా మాత్రమే మిగిలి పోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఇక్కడ పత్రికలు, వార్తా చానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు, వార్తా సంస్థలకు కొదవ ఏమీ లేదు. రాశిలో వాటి సంఖ్య ఘనమైనదే. కానీ వాస్తవాలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టులకు అడుగడుగునా అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లున్నాయి, భయాలున్నాయి. ఇటీవలి కాలంలో వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు జాబితాకూడా పెద్దదే. ఈ సంఖ్య జర్నలిజం ఎదుర్కొంటున్న ప్రమాద పరిస్థితులకు ఒక నిదర్శనంగా చూడాలి. ఇలాంటి అనేక సవాళ్ల మధ్య కూడా భారతీయ జర్నలిస్టులు కత్తిమీద సాములాగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.
పత్రికా రచన ఈ దేశంలో ఒకనాడు అత్యంత గౌరవనీయ వృత్తి. నాడు పత్రికల్లో వచ్చే వార్తలకు ఎంతో విశ్వసనీయత ఉండేది.ఇప్పుడు మాత్రం ఆ స్థితి లేదు. ఇప్పుడు ఆ విశ్వసనీయతను వెదుక్కోవాలి. ఇప్పుడు ఈ దేశంలో మీడియాకు సమాంతరంగా మాస్, సోషల్ మీడియా విస్తరించిపోయింది. కానీ ప్రచురించే, ప్రసారం చేసే వార్తలు, కథనాల్లో నిజానిజాలను బేరీజు వేసుకోవడం పాఠకుడు, వీక్షకుడికి చాలా కష్టమైన పనిగా మారిపోయింది. పెంటగాన్ జర్నలిస్టుల బహిష్కరణ ఇప్పుడు మొత్తం జర్నలిజానికి ఒక స్ఫూర్తిగా నిలవదగ్గ పరిణామంగా చెప్పాలి. ఈ బహిష్కరణనుంచి స్ఫూర్తి పొందగలిగితేనే ఏ దేశ జర్నలిజం అయినా నిలదొక్కుకొని ఆయా దేశాల్లో ప్రజాస్వామిక వ్యవస్థలు మనుగడ సాగిస్తుస్తాయి. అలా కాకుంటే తిరిగి పూర్వపు క్రూరమైన రాచరిక వ్యవస్థలు నియంతృత్వాల పునరుద్ధరణ ప్రమాదం పొంచి ఉంటుంది. అది ఆయా పౌర సమాజాల చైతన్యస్థాయిపై ఆధారపడి ఉంటుంది.
గోవర్ధన్ గందె
93470 56621