మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రా మీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను సడలించే ప్రతిపాదన మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. ఈ నెల 23న జరుగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. ఈ మేరకు ఇ ద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హత క లిగించే నిబంధనలను సడలించే ఫైల్ పై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క మంగళవారం సం తకం చేశారు. కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఈ ఫైలు చేరుతుంది.
అనంతరం గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ మంత్రి మండలి వెసుబాటు కల్పిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తీసుకువచ్చిన నిబంధనలు ప్రస్తుతం అవసరం లేదని, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అనర్హతను ఎత్తివేసి చట్ట సవరణ చేయాలని ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇలా చట్టసవరణ చేయడం వల్ల త్వరలో జరిగే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల నుంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.