పోలీసులు, సైనిక బలగాల అవిరణ కృషి ఫలితంగా త్వరలో నక్సలిజం కాలగర్భంలో కలిసిపోతుందని, చరిత్రలో ఓ మచ్చగా నిలిచిపోతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం నాడు ఉద్ఘాటించారు. పోలీసు సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ప్రసంగించారు. సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురిలో జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పుష్ప గుచ్ఛం సమర్పించి, అమర వీరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. సెరిమోనియల్ గార్డ్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
నక్సలిజం బెడదను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి ఫలితంగా ఒకప్పుడు ప్రభుత్వాలపై ఆయుధాలు ఎక్కుపెట్టిన మావోయిస్ట్ లే ప్రస్తుతం లొంగిపోయి అభివృద్ధి ప్రదాన స్రవంతిలోకి చేరుతున్నారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నక్సలైట్ల కు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలు విజయవంతమయినట్లే నన్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో నక్సల్స్ ముప్పు అంతమవుతుందని కేంద్రం ప్రకటించింది.
చాలా ఏళ్లపాటు నక్సలిజం మనదేశం అంతర్గత భద్రతకు ముప్పుగా ఉందని, ఒకప్పుడు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్రలోని అనేక జిల్లాలలో నక్సలిజం తీవ్రంగా ఉండేదని, ప్రజలు భయాందోళనలతో బతికే వారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు లేవు, రోడ్లు ఉండేవి కావు . ఆ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిర్ణయం ఫలితంగా, పోలీసులు,సిఆర్ పీఎఫ్, బీఎస్ ఎఫ్, స్థానిక పాలనా యంత్రాంగ కృషి చేయడంతో ఈ బెడద తొలగిపోయే రోజు త్వరలో వస్తుందని ఆయన తెలిపారు.
ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి వెల్లివిరుస్తోందని అన్నారు.మోదీ సర్కార్ పోలీసు దళాల ఆధునీకరణకు చేపడుతున్న చర్యలు, బడ్జెట్ ను కూడా మంత్రి వివరించారు. 1959లో లడఖ్ లో అత్యంత కఠినమైన వాతావరణంలో చైనా దళాలతో ప్రాణాలకు తెగించి పోరాడి మరణించిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు సిబ్బంది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.