రాష్ట్రం మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుందని, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదని, ఒక్కో లీడర్‌కు ఒక్కో ఆలోచన ఉండొచ్చని, కానీ, చట్టం అందుకు ఒప్పుకోదని, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందేనని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నట్టుగా సమాచారం. మద్యం విక్రయాలు, టెండర్‌లపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతుల గురించి పలువురు వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా సోమవారం ఆయన ఈ విధంగా అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది.
లిక్కర్ విక్రయాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో, వ్యాపారుల్లో అయోమయం నెలకొంది. దీంతో వారు మంత్రి వద్దకు వెళ్లి తమ బాధలను ఏకరువు పెట్టినట్టుగా తెలిసింది. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా నిబంధనలు పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలిసింది. డ్రా కు వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది.
ప్రభుత్వానికి నివేదిక
మద్యం విక్రయాలకు సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచాలని, పర్మిట్స్ రూమ్‌లకు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేశారు. ఈ విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది.