కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన మంచిర్యాల జిల్లా, నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధిందిచ వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన జగన్నాథం కుమారస్వామికి పెద్దపెల్లి జిల్లా, కనుకుల గ్రామానికి చెందిన పులిదండి రజిత (30)తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెళ్లయిన ఏడాది నుంచే అనుమానంతో కుమారస్వామి నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినప్పటికీ అతని తీరు మారలేదు.
శనివారం మళ్ళీ భార్యతో గొడవపడి చంపేస్తానని బెదిరించడంతో భయపడిన ఆమె ఆదివారం తెల్లవారుజామున పుట్టింటికి వెళ్ళింది. కుమారస్వామి అదేరోజు అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవపడి బైక్‌పై ఎక్కించుకొని మళ్లీ మందమర్రికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నస్పూర్ పరిధి జాతీయ రహదారి 363 బ్రిడ్జిపై మళ్లీ భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో కుమారస్వామి బ్రిడ్జి పైనుంచి భార్యను కిందకి తోసేశాడు. ఈ ఘటనలో రజిత ఘటన స్థలిలోనే మృతి చెందింది. అల్లుడే తన బిడ్డను హత్య చేశాడని రజిత తండ్రి పులిదండి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.