గోవా: భారత సాయుధ దళాల సిబ్బందితో దీపావళి జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం గోవా, కార్వార్ తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించి నావికా దళాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత నావికాదళ సైనికులతో దీపావళి జరుపుకోవడం తన అదృష్టమని అన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత సాయుధ దళాలను ప్రధాని ప్రశంసించారు. నేవీ, వైమానిక దళం, నావికాదళం మధ్య సమన్వయం పాకిస్తాన్‌ను త్వరగా లొంగిపోయేలా చేసిందని చెప్పారు. “నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్‌లో గడిపిన రాత్రిని మాటల్లో చెప్పడం కష్టం. మీరందరిలో నిండిన అపారమైన శక్తి, ఉత్సాహాన్ని నేను చూశాను. నిన్న మీరు దేశభక్తి గీతాలు పాడటం చూసినప్పుడు, మీ పాటలలో ఆపరేషన్ సిందూర్‌ను మీరు వర్ణించిన విధానం, యుద్ధభూమిలో నిలబడి ఒక జవాన్ అనుభవించే అనుభవాన్ని ఏ పదాలు పూర్తిగా వ్యక్తపరచలేవు” అని మోడీ ప్రశంసించారు.